ఎవరైనా చేయలేని పని చేసి చూపించినప్పుడు పెద్దవాళ్ళు నీ అసాధ్యం కూలా అంటారు. అదిప్పుడు అనిల్ రావిపూడికి అక్షరాలా వర్తిస్తుంది. సినిమాలో నటించడం తప్ప ప్రమోషన్లకు ఆమడ దూరంలో ఉండే నయనతారని మెగా 157 ఇంట్రో వీడియోకి ఒప్పించడం చూసి కోలీవుడ్ వర్గాలు సైతం ఆశ్చర్యపోతున్నాయి. ఏదో ఎక్కువ రెమ్యునరేషన్ ఇచ్చారనే కారణంతో అయితే ఖచ్చితంగా కాదు. ఎందుకంటే ఇంతకన్నా పెద్ద ప్యాన్ ఇండియా మూవీస్ లో చేసినప్పుడు కూడా నయన్ పబ్లసిటీకి దూరంగా ఉంది. ఎవరిదాకో ఎందుకు సైరా నరసింహారెడ్డిలో చిరు భార్యగా నటించినా సరే కనీసం ఇంటర్వ్యూ ఇవ్వలేదు.
గాడ్ ఫాదర్ లో మెగాస్టార్ చెల్లెలిగా ఆయనతో సమానంగా ఉండే క్యారెక్టర్ దక్కితే సోషల్ మీడియాలో ఒక థాంక్స్ లెటర్ పెట్టింది తప్ప బయట ఎక్కడా కనిపించలేదు. దర్శకుడు మోహన్ రాజా తమిళుడే అయినా సరే నో మొహమాటం అనేసింది. కానీ అనిల్ రావిపూడి ఈ లెక్కలన్నీ మార్చేశాడు. తన నెరేషన్ తో ఆవిడను మెప్పించడమే కాక ప్రమోషన్ల విషయంలో తాను తీసుకునే ప్రత్యేక శ్రద్ధ గురించి వివరించి చెప్పి ఒకే ఒక్క రోజులో చెన్నై వెళ్లి ప్రోమో వీడియో షూట్ చేసుకుని వచ్చాడు. ఇంకా రెగ్యులర్ షూటింగ్ కాక ముందే నయన్ ని ఈ రేంజ్ లో వాడటం అంటే మాములు విషయం కాదు.
చిరంజీవిని అవుట్ అండ్ అవుట్ ఎంటర్ టైన్మెంట్ పాత్రలో చూపిస్తున్న అనిల్ రావిపూడి ఈ సారి వింటేజ్ మెగా మాస్ ని బయటికి తీస్తా అంటున్నాడు. వెంకటేష్ ఒక ముఖ్య పాత్ర చేస్తున్నారనే టాక్ ఉంది కానీ యూనిట్ నుంచి ఇంకా ఎలాంటి అధికారిక ముద్ర లేదు. 2026 సంక్రాంతి విడుదలను లాక్ చేసుకున్న రావిపూడి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ సీజన్ మిస్ అయ్యే ప్రసక్తే లేకుండా పక్కా ప్లానింగ్ తో షెడ్యూల్స్ చేసుకుంటున్నాడు. వచ్చే నెల నుంచి చిత్రీకరణ మొదలుపెట్టి నవంబర్ కంతా గుమ్మడికాయ కొట్టాలనేది టార్గెట్. వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం ఇంతే వేగంగా పూర్తి చేసిన రావిపూడికి ఇదేమంత కష్టం కాదు.