తండేల్ హిట్టుతో సక్సెస్ ట్రాక్ లోకి వచ్చేసిన నాగచైతన్య తన కొత్త సినిమా విరూపాక్ష దర్శకుడు కార్తీక్ దండుతో మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోస్ లో ప్రత్యేకంగా వేసిన గుహ సెట్లో పద్దెనిమిది రోజులుగా షూటింగ్ జరుపుతున్నారు దీని కోసమే అయిదు కోట్ల దాకా ఖర్చు పెట్టినట్టు సమాచారం. నిన్న ప్రత్యేకంగా మీడియాని పిలిచి ఈ విశేషాలన్నీ చూపించిన నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ ఇంత ముందుగా అప్డేట్స్ ఇవ్వడం చూస్తే కంటెంట్ మీద ఏ స్థాయిలో నమ్మకం పెట్టుకున్నారో అర్థం చేసుకోవచ్చు. ప్రొడక్షన్ డిజైనర్ నాగేంద్ర తంగల నేతృత్వంలో దీన్ని అద్భుతంగా తీర్చిదిద్దారు.
ఇన్ సైడ్ టాక్ ప్రకారం చైతు ఇందులో పరిశోధకుడిగా కనిపిస్తాడు. ప్రపంచానికి తెలియని అంతు చిక్కని రహస్యాలను వెతికే క్రమంలో ఎదురయ్యే ప్రమాదాలు, ఆటంకాల నేపథ్యంలో స్క్రీన్ ప్లే చాలా గ్రిప్పింగ్ గా ఉంటుందని వినికిడి. విరూపాక్షలో హారర్ ఎలిమెంట్స్ హైలైట్ చేస్తే ఇందులో సస్పెన్స్ ప్రధాన పాత్ర పోషిస్తుందని అంటున్నారు. అంతర్లీనంగా హారర్ ఉన్నప్పటికీ థ్రిల్లర్ ఫీల్ ఎక్కువ కలిగేలా జాగ్రత్తలు తీసుకున్నారట. మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తున్న ఈ ప్యాన్ ఇండియా మూవీకి వృషకర్మ టైటిల్ పరిశీలనలో ఉంది. దీనికన్నా మెరుగైంది తట్టకపోతే ఇదే ఫైనల్ చేయాలని నిర్ణయించుకున్నారట.
ఇరవై నిమిషాలకు పైగా వచ్చే కీలకమైన ఎపిసోడ్ మొత్తం ఈ గుహలోనే జరుగుతుందని, మిగిలిన కథకు సంబంధించిన ముఖ్యమైన లీడ్ దీంట్లోనే డిజైన్ చేశారని తెలిసింది. దూత వెబ్ సిరీస్ రూపంలో గతంలో ఫాంటసీ సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ చేసిన నాగ చైతన్యకు ఈ వృషకర్మ అంతకు పదింతలు హై వోల్టేజ్ తో ఉండటం వల్లే ఒప్పుకున్నట్టు చెబుతున్నారు. అజనీష్ లోకనాథ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మరో ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. 2026 వేసవి విడుదలను లక్ష్యంగా పెట్టుకున్నారు. షూటింగ్ త్వరగా అయిపోయినా విఎఫ్ఎక్స్ తో ముడిపడిన కంటెంట్ కనక పోస్ట్ ప్రొడక్షన్ కు ఎక్కువ సమయం అవసరమవుతుంది.