నాయకుడు వచ్చిన 38 సంవత్సరాల తర్వాత కుదిరిన కాంబోగా కమల్ హాసన్ – మణిరత్నం నుంచి వస్తున్న తగ్ లైఫ్ మీద ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఒక కల్ట్ క్లాసిక్ ఇచ్చాక ఇంత గ్యాప్ రావడం అరుదని చెప్పాలి. కారణాలు ఏవైనా మూడు దశాబ్దాల తర్వాత ఈ ఇద్దరు చేతులు కలపడం పట్ల ఫ్యాన్స్ సంతోషంగా ఉన్నారు. జూన్ 5 విడుదల కాబోతున్న ఈ గ్యాంగ్ స్టర్ డ్రామా కోసం కమల్ హాసన్ నాన్ స్టాప్ ప్రమోషన్లు చేస్తున్నారు. ఏపీ తెలంగాణతో పాటు దక్షిణాది రాష్ట్రాలన్నీ కవర్ చేసేలా పెద్ద ప్రోగ్రాం ప్లాన్ చేసుకున్నారు. ఇంత వయసులోనూ కమల్ హాసన్ ఓపిక చూసి వావ్ అనకుండా ఉండటం కష్టం.
ఇదిలా ఉండగా పలు ఇంటర్వ్యూలలో కమల్ చెప్పిన మాటలను బట్టి తగ్ లైఫ్ స్టోరీకి సంబంధించిన కీలక లీకులు బయటికి వచ్చేశాయి. వాటి ప్రకారం ఈ సినిమాలో ఆయన పేరు రంగరాయ శక్తివేల్ నాయకర్. మాఫియా ప్రపంచాన్ని గడగడలాడించిన అతను ఒక తీవ్ర సంఘటనలో చనిపోయాడని అందరూ భావిస్తారు. కానీ ఊహించని పరిస్థితుల్లో తిరిగి వస్తాడు. కొడుకు శింబు అప్పటికే లీడర్ గా పేరు తెచ్చుకుంటాడు. ముందు కలుసుకున్నా క్రమంగా ఇద్దరు శత్రువులుగా మారేలా చేయి దాటిపోతుంది. అక్కడి నుంచి వచ్చే మలుపులు మణిరత్నం స్టైల్ లో ఉక్కిరి బిక్కిరి చేసేలా ఉంటాయని చెన్నై టాక్.
కొంచెం ఇదే తరహా బ్యాక్ డ్రాప్ లోనే గతంలో మణిరత్నం నవాబ్ తీశారు. అందులోనూ శింబు ఉన్నాడు. ఇప్పుడు తగ్ లైఫ్ లైన్ దానికి దగ్గరగా అనిపిస్తోంది. పొన్నియిన్ సెల్వన్ లాంటి విజువల్ గ్రాండియర్ తర్వాత వస్తున్న మూవీ కావడంతో తమిళనాట పెద్ద బజ్ ఉంది. ఏఆర్ రెహమాన్ సంగీతం సమకూర్చడం, అశోక్ సెల్వన్ – సాన్య మల్హోత్రాతో పాటు త్రిష హీరోయిన్ గా నటించడం హైప్ పెంచుతున్నాయి. తెలుగులోనూ మంచి రిలీజ్ దక్కించుకోబోతున్న తగ్ లైఫ్ హక్కులు నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి తీసుకోవచ్చని ట్రేడ్ టాక్. విక్రమ్ పంపిణి చేసింది ఆయనే. జూన్ 5 తగ్ లైఫ్ కి కాంపిటీషన్ లేదు.