పెద్ది ప్రకటించిన టైంలో రామ్ చరణ్ అభిమానులు టెన్షన్ పడిన విషయం ఏఆర్ రెహమాన్ సంగీతం గురించే. గత కొన్నేళ్లుగా ఈయన చెప్పుకోదగ్గ ఫామ్ లో లేకపోవడంతో పాటు తెలుగులో స్ట్రెయిట్ బ్లాక్ బస్టర్ లేదనే నెగటివ్ సెంటిమెంట్ పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. ఉప్పెనకు బెస్ట్ ఆల్బమ్ ఇచ్చిన దేవీశ్రీ ప్రసాద్ అయితే రంగస్థలం లాంటి అదిరిపోయే పాటలు ఇచ్చేవాడని అభిప్రాయపడ్డారు. కట్ చేస్తే పెద్ది టీజర్ వాళ్ళ భయాలన్నీ పోగొట్టింది. నెలన్నర క్రితం వదిలిన చిన్న వీడియో రేపిన సెన్సేషన్ అంతా ఇంతా కాదు. ముఖ్యంగా ఐపీఎల్ సీజన్ లో పెద్ది క్రికెట్ షాట్ రేపిన రచ్చ గురించి ఎంత చెప్పినా తక్కువే.
ఇక పాటల విషయంలో కూడా టెన్షన్ అక్కర్లేదంటున్నారు దర్శకుడు బుచ్చిబాబు. ఇటీవలే ఒక ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఒక్కో పాటకు రెహమాన్ 30 ఆప్షన్లు ఇచ్చేవారని, వాటి నుంచి బెస్ట్ ఎంచుకోవడం పెద్ద సవాల్ గా ఉండేదని చెప్పుకొచ్చారు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అంచనాలకు మించి ఉంటుందని హామీ ఇచ్చారు. గ్రామీణ మూలాలను స్పృశించే తన కథలను ఇష్టపతానని రెహమాన్ చెప్పడం పట్ల బుచ్చిబాబు సంతోషం వ్యక్తం చేశారు. నిజానికి ఈయన పట్టుదల వల్లే రెహమాన్ పెద్దికి వచ్చారు కానీ లేదంటే అందరూ అనుకున్నట్టు దేవినో తమనో ఈ ప్రాజెక్టుకి లాకయ్యేవాళ్ళు.
ఇక క్రికెట్ గురించి మాట్లాడుతూ ఇది కేవలం బ్యాక్ డ్రాప్ లో మాత్రమే ఉంటుందని, దానికి మించిన బలమైన ఎమోషన్ స్టోరీని డ్రైవ్ చేస్తుందని వివరించారు. ఇప్పటిదాకా ముప్పై శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న పెద్ది కొత్త షెడ్యూల్ రేపటి నుంచి తిరిగి ప్రారంభం కానుంది. వచ్చే ఏడాది మార్చి 27 విడుదల కాబోతున్న ఈ విలేజ్ స్పోర్ట్స్ డ్రామాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. శివరాజ్ కుమార్ పాత్ర మీద ఇప్పటికీ ఓ రేంజ్ హైప్ ఉంది. మీర్జాపూర్ దివ్యెందు, జగపతిబాబు తదితర క్యాస్టింగ్ ఇందులో పెద్దదే ఉంది. 2026 సంక్రాంతికి ట్రైలర్ లాంచ్ చేసే ఆలోచనలో యూనిట్ ఉంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates