అమీర్ ఖాన్ గంపెడాశలు పెట్టుకున్న సితారే జమీన్ పర్ ట్రైలర్ విడుదలయ్యింది. రిలీజ్ డేట్ ఇంకా నెల రోజులకు పైగానే ఉన్నా హైప్ ప్లస్ బిజినెస్ కోసం అమీర్ చాలా త్వరగా వదిలేశారు. ఆర్ఎస్ ప్రసన్న దర్శకత్వం వహించగా ఫ్యాన్స్ లో దీని మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. మూడున్నర నిమిషాల సుదీర్ఘమైన ట్రైలర్ లో కథ మొత్తం చెప్పేశారు. తన ప్రవర్తన కారణంగా బాస్కెట్ బాల్ కోచ్ కు కోర్టు విచిత్ర శిక్ష విదిస్తుంది. అదేంటంటే మానసిక ఎదుగుదల సరిగా లేని ఒక బృందానికి కోచింగ్ ఇవ్వడం. ఇష్టం లేకపోయినా బాధ్యతను తీసుకున్న సదరు కోచ్ కు మొదటి రోజు నుంచే చుక్కలు కనిపిస్తాయి.
చిత్ర విచిత్రంగా ఉన్న వాళ్ళ ప్రవర్తనలను ఒక తాటిపైకి తీసుకొచ్చి మ్యాచ్ ఎలా గెలిపించాడనే పాయింట్ మీద సితారే జమీన్ పర్ నడుస్తుంది. కాన్సెప్ట్ పరంగా చూస్తే తారే జమీన్ పర్, చెక్ దే ఇండియా, దంగల్ లాంటి చాలా సినిమాల షేడ్స్ ఇందులో కనిపించాయి. కాకపోతే ఇక్కడ మెంటల్ డిసేబుల్డ్ కాన్సెప్ట్ తప్ప మిగిలిన డ్రామా అంతా చాలాసార్లు చూసినట్టే అనిపిస్తుంది. సోషల్ మీడియాలో ప్రస్తుతం ఇవే తరహా అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆర్టిస్ట్ గా అమీర్ తనవరకు న్యాయం చేసేలా ఉన్నా కంటెంట్ మాత్రం పాత సీసాలో కాసింత కొత్త సారాలా కనిపిస్తున్న మాట వాస్తవం .
బాలీవుడ్ బాక్సాఫీస్ కు అమీర్ ఖాన్ కొత్త ఉత్సాహం తెస్తాడనే ఆశతో బయ్యర్లు ఎదురు చూస్తున్నారు. చావా తర్వాత మళ్ళీ ఆ స్థాయి సక్సెస్ దక్కలేదు. తర్వాత వచ్చినవి అంతంత మాత్రంగా ఆడాయి. కేసరి చాప్టర్ 2, రైడ్ 2 కొంత వరకు బాగానే వెళ్తున్నా వంద కోట్లు దాటేందుకు కిందా మీద పడ్డాయి కనక వాటిని ఇండస్ట్రీ హిట్స్ గా పరిగణించలేని పరిస్థితి. సితారే జమీన్ పర్ లో బొమ్మరిల్లు ఫేమ్ జెనీలియా డిసౌజా హీరోయిన్ గా నటించింది. అమీర్ ఖాన్ పక్కన డాన్సులు చేయడానికి కాదు కానీ అతని పక్కనే ప్రయాణం చేసే క్యారెక్టర్ ని డిజైన్ చేశారు. పోటీ చూసుకుంటే ఈ సినిమాకు ధనుష్ నాగార్జున కుబేరతో డైరెక్ట్ క్లాష్ ఉంది.