ట్రోలింగ్ మోత.. జయం రవి గర్ల్ ఫ్రెండ్‌ కౌంటర్

తమిళ స్టార్ హీరోల్లో ఒకడైన జయం రవి వ్యక్తిగత జీవితం గురించి ఇటీవల పెద్ద చర్చ జరుగుతోంది. గత ఏడాది తన భార్యతో 18 ఏళ్ల వైవాహిక బంధానికి తెరదించుతున్నట్లు, తాము విడాకులు తీసుకోనున్నట్లు ప్రకటించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు రవి. కోలీవుడ్ బెస్ట్ కపుల్స్‌లో ఒకటిగా పేరు తెచ్చుకున్న జంట ఇలా విడిపోతుందని ఎవ్వరూ ఊహించలేదు. ఐతే జయం రవి ఈ విడాకుల గురించి ప్రకటించాక ఆర్తి లైన్లోకి వచ్చి.. తన భర్త నుంచి విడిపోవడం తనకు ఇష్టం లేదని.. తమ బంధాన్ని నిలబెట్టుకునేందుకే ప్రయత్నిస్తున్నానని చెప్పడం మరింత ఆశ్చర్యపరిచింది.

ఐతే రవి ఈ విషయంలో వెనక్కి తగ్గలేదు. విడాకుల కేసు ప్రస్తుతం కోర్టులో ఉండగా.. ఇటీవల సింగర్ కెనీషాతో ఓపెన్‌గా బయట తిరిగేస్తున్నాడు రవి. దీనిపై ఆర్తి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఇటీవల రిలీజ్ చేసిన ఎమోషనల్ నోట్ వైరల్ అయింది. దీంతో కెనీషా మీద సోషల్ మీడియాలో వార్ మొదలైంది. పచ్చని కాపురంలో చిచ్చు పెట్టావంటూ ఆమె మీద తమిళ జనాలు విరుచుకుపడుతున్నారు. ఐతే కెనీషా ఏమీ ఊరుకోలేదు. తనను విమర్శించే వాళ్లందరికీ గట్టిగానే కౌంటర్ ఇచ్చింది.

పరోక్షంగా ఆమె ఆర్తిని కూడా టార్గెట్ చేసింది. తన మీద పీఆర్ దాడి జరుగుతోందని ఆమె ఆరోపించింది. ‘‘నాతో ఏదైనా చెప్పాలనుకుంటే నేరుగా నాతోనే డీల్ చేయండి. నేరుగా నా ముఖంపై చెప్పండి. మీరు ఏం అనుకుంటున్నారో నాక్కూడా తెలుస్తుంది కదా. పీఆర్‌లను ఉపయోగించాల్సిన అవసరం లేదు. సొంత విషయాలు పట్టించుకోవడం మానేసి ఎవరైతే ఓవర్‌గా మాట్లాడుతున్నారో నా ముందుకు రండి. ఇతరుల దృష్టిని ఆకర్షించాలని మీరందరూ ఇప్పుడు కోరుకుంటున్నారని నాకు అనిపిస్తోంది. మీ అందరూ ప్రశాంతంగా జీవించాలని కోరుకుంటున్నా’’ అని కెనీషా పేర్కొంది.