లోకేష్ కనకరాజ్.. ప్రస్తుతం సౌత్ ఇండియాలో మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్లలో ఒకడు. ఖైదీ, విక్రమ్ లాంటి చిత్రాలతో అతను తిరుగులేని క్రేజ్ సంపాదించుకున్నాడు. ప్రస్తుతం అతను సూపర్‌స్టార్ రజినీకాంత్ హీరోగా రూపొందిస్తున్న కూలీ సినిమాపై అంచనాలు మామూలుగా లేవు. అక్కినేని నాగార్జున, ఉపేంద్ర కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం.. కోలీవుడ్లో తొలి వెయ్యి కోట్ల సినిమా అవుతుందనే అంచనాలు కూడా ఉన్నాయి. ఐతే రజినీతో సినిమా ఓకే అయినపుడు లోకేష్ ఆయనకు చెప్పిన ఇది కాదట. ముందు సూపర్ స్టార్‌కు ఓ కథ చెబితే.. ఆయనకు చాలా నచ్చిందని.. కానీ రెండు నెలల తర్వాత వెళ్లి ఆయనకు వేరే కథ చెప్పానని లోకేష్ తెలిపాడు.
ముందు అనుకున్న కథ రజినీకి చాలా నచ్చినప్పటికీ.. ఆయనతో వేరే కథ చేస్తే బాగుంటుందని కూలీ స్క్రిప్టు రాశానని.. తాను కథ మార్చినా అభ్యంతర పెట్టకుండా రజినీ ఈ సినిమా చేశాడని లోకేష్ తెలిపాడు. కూలీ సినిమా చేస్తూ ప్రతి రోజూ రజినీ నుంచి జీవిత పాఠాలు నేర్చుకున్నట్లు లోకేష్ తెలిపాడు. తాను కూలీ లాంటి మల్టీస్టారర్ మూవీని ఆర్ఆర్ఆర్ తరహాలో మూడేళ్లు తీయలేనని.. ఎనిమిది నెలల్లోనే ఈ చిత్రం పూర్తయిందని.. ఐతే ఈ సినిమాలో కీలక పాత్రలు చేస్తున్న ఆర్టిస్టులందరికీ వేరే సినిమా చేయకుండా అదే లుక్‌లో ఉండాలని మాత్రం షరతు పెట్టానని లోకేష్ తెలిపాడు.
తన తర్వాతి చిత్రం ఖైదీ-2నే అని ఖరారు చేసిన లోకేష్.. దాని తర్వాత విక్రమ్-2 ఉంటుందన్నాడు. విజయ్‌తో లియో-2 కూడా చేయాల్సి ఉందని, అలాగే రోలెక్స్ పాత్రతో స్టాండ్ అలోన్ మూవీకి కూడా ఐడియా రెడీ అయిందని లోకేష్ తెలిపాడు. ఇక రజినీకాంత్, కమల్ హాసన్ ఇద్దరినీ పెట్టి ఒక మల్టీస్టారర్ చేయాలని ఉందని.. ఇద్దరు వయసు మీద పడ్డ గ్యాంగ్ స్టర్స్ జీవితాలను ఈ సినిమాలో చూపిస్తే ఎలా ఉంటుందని ఆలోచిస్తున్నానని.. ఆ ఐడియాను వాళ్లిద్దరికీ చెప్పడం కూడా అయిందని.. ఇక నిర్ణయం తీసుకోవాల్సింది వారే అని.. కానీ అదంత తేలికైన విషయం కాదని లోకేష్ అన్నాడు. లియో మీద వచ్చిన విమర్శలకు తానేమీ దిగాలు పడిపోలేదని.. కానీ ఫీడ్ బ్యాక్ మాత్రం తీసుకున్నానని లోకేష్ చెప్పాడు.