ప్రభాస్‌, ఎన్టీఆర్‌లతో నటించలేను- వెన్నెల కిషోర్

కెరీర్లో ప్రస్తుత దశలో తాను రెబల్ స్టార్ ప్రభాస్, యంగ్ టైగర్ ప్రభాస్ లాంటి హీరోలతో నటించలేనంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు కమెడియన్ వెన్నెల కిషోర్. గత కొన్నేళ్లలో ఈ స్టార్ హీరోల రేంజ్ పెరిగిపోయిందని.. ఇమేజ్ మారిపోయిందని.. అలాంటి హీరోల సినిమాలో తనకు సరైన క్యారెక్టర్లు రాయడం సాధ్యం కాదని కిషోర్ తెలిపాడు. తాను అలాంటి స్టార్ల సినిమాల్లో హీరోల ఫ్రెండు పాత్రలు చేయాల్సి ఉంటుందని.. కానీ వాళ్ల ఇమేజ్ మారిన దృష్ట్యా తాను కామెడీ చేయలేనని.. వారి సినిమాల్లో తాను ఊరికే నిలబడి చూడడం తప్ప చేసేదేమీ లేదని అతను పేర్కొన్నాడు.

‘సింగిల్’ సినిమాలో తన పాత్రకు వస్తున్న స్పందన పట్ల సంతోషం వ్యక్తం చేసిన కిషోర్.. మంచి కామెడీ టైమింగ్ ఉన్న శ్రీ విష్ణు వల్లే తన పాత్ర కూడా హైలైట్ అయిందని చెప్పాడు.
‘శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్’ సినిమా ప్రమోషన్లకు రాకపోవడం గురించి, దాని చుట్టూ నెలకొన్న వివాదం గురించి వెన్నెల కిషోర్ స్పందించాడు. ‘‘ఆ సినిమా విషయంలో తప్పు జరిగింది. నిజానికి నేనెప్పుడూ దర్శకుడిని కథ అడగను. ఏమో ఒకవేళ అడిగితే.. ‘కమెడియన్‌వి నీకు కూడా కథ చెప్పాలా’ అనే ఎక్స్‌ప్రెషన్ ఇస్తారేమో అని భయం.

అందుకే నా ట్రాక్ వరకు చెబితే చాలంటా. ఆ సినిమా విషయంలోనూ అదే జరిగింది. దీంట్లో నాది చిన్న ఇన్వెస్టిగేటివ్ పాత్ర అని చెప్పారు. 7 రోజుల కాల్ షీట్స్ అడిగారు. అనన్య నాగళ్లతో పాటు మరో కుర్రాడు మెయిన్ లీడ్ అని చెప్పారు. ఆ పాత్ర నేను చేసి వచ్చాక గెటప్ శీను ఫోన్ చేసి ఈ సినిమాలో హీరో నువ్వేనట కదా అని అడిగాడు. దర్శకుడికి ఫోన్ చేసి అడిగితే అలాంటిదేమీ లేదన్నాడు. తీరా పోస్టర్ చూస్తే నన్ను హీరోగా చూపిస్తూ నా పాత్ర పేరుతో టైటిల్ చూసేసరికి నాకు పిచ్చెక్కిపోయింది. నేను హీరోగా చేయని సినిమాకు నేనే హీరో అన్నట్లు ప్రమోట్ చేయడం కరెక్ట్ కాదని ఆ సినిమా ప్రచారంలో పాల్గొనలేదు’’ అని కిషోర్ తెలిపాడు.