సౌత్ లోనే కాదు బాలీవుడ్ లోనూ మంచి డిమాండ్ ఎంజాయ్ చేస్తున్న హీరోయిన్ రష్మిక మందన్న. యానిమల్, పుష్ప 2 ది రూల్, ఛావాతో హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్లు అందుకున్నాక సల్మాన్ ఖాన్ సికందర్ రూపంలో తనకు మొదటి షాక్ తగిలింది. దానికి ఆమె కారణం కాకపోయినా గోల్డెన్ లెగ్ గా దూసుకుపోతున్న టైంలో కండల వీరుడిచ్చిన ఫ్లాప్ పంటి కింద రాయిలా అడ్డం పడింది. అందులోనూ తనది చనిపోయే పాత్ర కావడం అభిమానులను మరింత బాధ పెట్టింది. వచ్చే నెల 20 విడుదల కాబోయే కుబేరలో ధనుష్ సరసన కనిపించనుంది. శేఖర్ కమ్ముల దర్శకుడు కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి.
ఇదంతా ఓకే కానీ రష్మిక మందన్న టైటిల్ రోల్ పోషించిన ది గర్ల్ ఫ్రెండ్ రిలీజ్ గురించి ఎలాంటి అప్డేట్ లేకపోవడం ఫ్యాన్స్ ని ఆశ్చర్యపరుస్తోంది. ఎందుకంటే టీజర్ వచ్చి నాలుగు నెలలు దాటేసింది. విజయ్ దేవరకొండ వాయిస్ ఓవర్ తో గత డిసెంబర్ లోనే లాంచ్ చేశారు. తర్వాత సైలెంట్ అయిపోయారు. చిలాసౌ, మన్మధుడు 2 ఫేమ్ రాహుల్ రవీంద్రన్ దీనికి దర్శకత్వం వహించారు. అల్లు అరవింద్ సమర్పకులుగా వ్యవహరించిన గర్ల్ ఫ్రెండ్ కి ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి నిర్మాతలుగా ఉన్నారు. ఇటీవలే రిలీజైన శ్రీవిష్ణు సింగల్ నిర్మించిన గీతా ఆర్ట్స్ బ్యానర్ పైనే ఇది రూపొందింది.
బడ్జెట్ భారీది కాకపోయినా, విఎఫెక్స్ అంతగా అవసరం లేకపోయినా ది గర్ల్ ఫ్రెండ్ ఇంత ఆలస్యం కావడం ఆశ్చర్యమే. షూటింగ్ అయిపోయిందని, కొంచెం ప్యాచ్ వర్క్ మినహా పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి కావస్తోందని అంతర్గత సమాచారం. కొంత భాగం రీ షూట్ తో పాటు ఓటిటికి సంబంధించిన డీల్ లేటవ్వడం వల్ల విడుదల తేదీ నిర్ణయించుకోలేకపోయారని అంటున్నారు. రష్మిక మందన్నకున్న బ్రాండ్ వల్ల ఈ సినిమాకి మిగతా భాషల్లోనూ బిజినెస్ జరిగిపోతుంది. అసలే ఆగస్ట్ దాకా డేట్లన్నీ లాకైపోతున్నాయి. మరి గర్ల్ ఫ్రెండ్ ఎప్పుడు వస్తుందో చూడాలి. ప్రస్తుతం రష్మిక బాలీవుడ్ హారర్ మూవీ ‘తమ’లో బిజీగా ఉంది.