కేరళ సినిమాల ఆల్ టైం కలెక్షన్ల రికార్డులు తీస్తే.. అందులో మోహన్ లాల్ పేరు చాలా చోట్ల కనిపిస్తుంది. అక్కడ దశాబ్దాల నుంచి ఆయన ఇండస్ట్రీ హిట్లు కొడుతూనే ఉన్నారు. తన రికార్డులను తనే అధిగమించడం.. వేరే వాళ్ల రికార్డులనూ బద్దలు కొట్టడం ఆయనకు అలవాటైన విషయం. కేవలం నెల వ్యవధిలో రెండు భారీ బ్లాక్ బస్టర్లు ఇవ్వడం.. రికార్డులను సవరించడం ఆయనకే చెల్లింది. మార్చి నెలాఖర్లో వచ్చిన ‘ఎల్-2: ఎంపురాన్’కు డివైడ్ టాక్ వచ్చినా సరే.. భారీ వసూళ్లు రాబట్టి మలయాళ సినిమాకు రూ.300 కోట్ల క్లబ్బును పరిచయం చేసింది. ఇంకో నెల రోజుల్లోపే పెద్దగా అంచనాలు లేకుండా వచ్చిన మోహన్ లాల్ మరో సినిమా ‘తుడరుమ్’ అద్భుతమైన టాక్ తెచ్చుకుని వసూళ్ల మోత మోగిస్తూ సాగిపోతోంది.
విడుదలైన మూడు వారాలకు కూడా ఈ సినిమా జోరు తగ్గట్లేదు. ‘తుడరుమ్’ తాజాగా కేరళలో ఆల్ టైం హైయెస్ట్ గ్రాసర్ రికార్డును అందుకుంది. ఓవరాల్ కలెక్షన్ల రికార్డు ‘ఎంపురాన్’దే కాగా.. ఇప్పుడు కేరళ వరకు అత్యధిక వసూళ్ల ఘనతను ‘తుడరుమ్’ సొంతం చేసుకుంది. ఈ చిత్రం ఇప్పటిదాకా కేరళలో రూ.90 కోట్ల వసూళ్లు రాబట్టింది. 2023లో వచ్చిన ‘2018’ రూ.89 కోట్లతో నెలకొల్పిన రికార్డు ఇప్పుడు బద్దలైంది.
‘ఎంపురాన్’ రూ.86 కోట్లతో ‘2018’ రికార్డుకు చేరువగా వచ్చినప్పటికీ త్రుటిలో రికార్డు కోల్పోయింది. కానీ ‘తుడరుమ్’ మూడో వారంలోనూ నిలకడగా వసూళ్లు సాధిస్తూ రికార్డును సొంతం చేసుకుంది. ఈ సినిమా ఓవరాల్ వసూళ్లు రూ.180 కోట్లకు చేరువగా ఉన్నాయి. త్వరలోనే రూ.200 కోట్ల మార్కును కూడా ఈ సినిమా అందుకునే అవకాశముంది. నెల వ్యవధిలో ఇలా రెండు భారీ బ్లాక్ బస్టర్లు ఇవ్వడం మోహన్ లాల్‌కే చెల్లిందని.. ఆయన తిరుగులేని బాక్సాఫీస్ సత్తాకు ఇది నిదర్శనమని అభిమానులు కొనియాడుతున్నారు.