హిట్-3 డైలాగ్.. నాని రియల్ లైఫ్‌కి కనెక్షన్

ఒక మామూలు మధ్యతరగతి వ్యక్తి సినిమాల్లోకి వెళ్తాం అని అంటే.. కంగారు పడేవాళ్లే కుటుంబ సభ్యులే ఎక్కువ. బ్యాగ్రౌండ్ లేకుండా సినీ రంగంలో నిలదొక్కుకోవడం చాలా కష్టమనే అభిప్రాయమే ఉంటుంది చాలామందిలో. అయినా మొండి ధైర్యంతో ఇండస్ట్రీలోకి వచ్చి తమ సత్తా చాటుతుంటారు కొందరు. ప్రస్తుతం టాలీవుడ్ స్టార్లలో ఒకడిగా ఎదిగిన నాని సైతం ఏ బ్యాగ్రౌండ్ లేకుండా ఇక్కడికి వచ్చి కేవలం తన టాలెంటుతో పెద్ద రేంజికి ఎదిగిన వాడే. నాని అండతో దర్శకురాలిగా కూడా మారిన అతడి సోదరి దీప్తి గంటా సైతం.. తన తమ్ముడు సినిమాల్లోకి వస్తానంటే ఎంకరేజ్ చేయలేదట.

ఇంట్లో వాళ్లందరం ఇక్కడ అతను సర్వైవ్ కావడం కష్టమనే అన్నట్లు ఆమె ‘హిట్-3’ సక్సెస్ మీట్లో వెల్లడించింది. విశేషం ఏంటంటే.. తన కుటుంబ సభ్యుల మీద సరదాగా సెటైర్ వేస్తున్నట్లు ‘హిట్-3’లో నాని ఒక డైలాగ్ కూడా చెప్పాడట. నాని చేతుల్లో చనిపోయే ఒక అమ్మాయి.. ‘‘నువ్వు ఇక్కడ సర్వైవ్ అవ్వలేవు’ అంటుంది. దానికి బదులుగా ’కెరీర్ మొదట్నుంచి ఈ మాట వింటూనే ఉన్నా’ అంటాడు. ఈ డైలాగ్ గురించి సక్సెస్ మీట్లో‌ దీప్తి ప్రస్తావించింది.

‘‘ఈ సినిమా విషయంలో నేను ఇన్వాల్వ్ కాలేదు. కోర్ట్ సినిమా పనిలో బిజీగా ఉండడంతో వేరే వ్యక్తి ఈ సినిమా విషయాలు చూసుకున్నాడు. ఈ సినిమా ట్రైలర్లో మీరు చూసిన ‘సర్వైవ్ అవ్వలేరు’ అనే డైలాగ్‌ను ముందు నుంచి నేను నానితో అంటూ వచ్చాను. నేను, మా అమ్మా నాన్న నానిని సినిమాలకు దూరంగా ఉండమని చెప్పేవాళ్లం. సినిమాల్లో సర్వైవ్ అవ్వలేవని అంటుండేవాళ్లం. కానీ ఈ రోజు అతను ఇక్కడ సర్వైవ్ కావడమే కాదు.. వేరే వాళ్లకు రోల్ మోడల్‌గా తయారయ్యాడు. నానిని చూసి గర్వపడుతున్నాను’’ అని దీప్తి చెప్పింది.