-->

సమంత.. ‘ట్రాలాలా’ వెనుక కథేంటి?

ఇన్నేళ్లు సమంతను ఒక కథానాయికగానే చూశాం. కానీ ఇప్పుడు ఆమెను నిర్మాతగా చూస్తున్నాం. తన ప్రొడక్షన్లో తెరకెక్కిన తొలి చిత్రం ‘శుభం’.. ఇంకో రెండు రోజుల్లోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తన ప్రొడక్షన్ హౌస్‌కు ‘ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్’ అని పేరు పెట్టుకుంది సమంత. ఈ పేరుకు అర్థమేంటా అని ఆమె ఫ్యాన్స్ ఆలోచిస్తున్నారు. దీనికి స్వయంగా సమంతనే సమాధానం చెప్పింది. ‘‘నా చిన్నపుడు స్కూల్లో ‘బ్రౌన్ గర్ల్ ఇన్ ద రెయిన్.. ట్రాలాలా’’ అని ఫ్రెండ్స్ ఓ రైమ్ పాడుకునేవాళ్లం. నా ప్రొడక్షన్ హౌస్‌కు ఏం పేరు పెట్టాలా అని ఆలోచిస్తున్నపుడు ఈ పద్యం గుర్తుకొచ్చి దాన్నే పెట్టేశా’’ అని సమంత వెల్లడించింది.

ఇక శుభం కథ గురించి, తన పాత్ర గురించి సమంత చెబుతూ.. ‘‘ఈ కథంతా ఒక సీరియల్‌తో ముడి పడి ఉంటుంది. మామూలుగా మనం ఓ సీరియల్ చూస్తున్నపుడు దీనికి ఎప్పుడు శుభం కార్డు పడుతుందా అని ఎదురు చూస్తుంటాం. ఈ సినిమాలోనూ పాత్రలన్నీ అలాగే ఎదురు చూస్తుంటాయి. కానీ అందుకు కారణం వేరు. ఇందులో నా పాత్ర కొంచెం కీలకమైందే. నిజానికి ఆ క్యారెక్టర్ ముందు నేను చేయాలనుకోలేదు. కానీ ఓ నిర్మాతగా వేరొకరి దగ్గరికి వెళ్లి సాయం చేయాలని అడగాలనిపించలేదు. అందుకే ఆ పాత్రను నేనే చేశా’’ అని వెల్లడించింది.

సినిమా నిర్మాణంలోకి రావాలనుకున్నపుడు చాలామంది ఎందుకమ్మా అనే అన్నారని.. ఈ రోజుల్లో ప్రేక్షుకులను థియేటర్లకు తీసుకురావడం నిజంగానే చాలా కష్టమైన పని అని.. కానీ తాను కంటెంట్‌ను నమ్మి ‘శుభం’ సినిమా చేశానని.. సినిమా పూర్తయ్యే వరకు తాను ఈ చిత్రం చేస్తున్నట్లు కూడా చెప్పలేదని.. సినిమా తీశాక దాని మీద పూర్తి భరోసాతో బరిలోకి దిగుతున్నానని సమంత చెప్పింది. తాను అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటించనున్న చిత్రంలో ఓ పాత్ర చేయబోతున్నట్లు వస్తున్న వార్తలు అవాస్తవమని ఈ సందర్భంగా సమంత క్లారిటీ ఇచ్చింది.