ఈ సంవత్సరం ఇండియన్ సినిమా బిగ్గెస్ట్ క్లాష్ గా ట్రేడ్ అభివర్ణిస్తున్న ఆగస్ట్ 14 జరిగే కూలీ వర్సెస్ వార్ 2 కోసం ప్రేక్షకులు విపరీతమైన ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. సరిగ్గా ఇంకో 100 రోజుల్లో ఈ దిగ్గజాల యుద్ధాన్ని చూడబోతున్నాం. ప్రమోషన్ల పరంగా కూలి రెండు మూడు అడుగులు ముందే ఉండటం జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ ఫ్యాన్స్ ని ఖంగారు పెడుతోంది. తాజాగా కూలీ కౌంట్ డౌన్ టీజర్ వదిలారు. మొహాలు చూపించకుండా హీరోల బ్యాక్ షాట్స్ చూపించి అనిరుద్ రవిచందర్ అదిరిపోయే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో అంచనాలు ఎక్కడికో వెళ్లేలా కట్ చేశారు. రజినిని మాత్రమే కొంతమేర రివీల్ చేశారు.
దీనికన్నా ముందు పాట ప్రోమో, అనౌన్స్ మెంట్ వీడియో, ఫస్ట్ లుక్ పోస్టర్స్ ఇలా కూలికి సంబంధించిన కంటెంట్ బాగానే వచ్చింది. కానీ వార్ 2లో తారక్, హృతిక్ ఎలా ఉంటారో కూడా చూపించలేదు. కనీసం ఒక్క ఇమేజ్ బయటికి రాలేదు. పాటల సంగతి తర్వాత కనీసం ఒక చిన్న టీజర్ వచ్చినా అభిమానులు పండగ చేసుకుంటారు. కానీ యాష్ రాజ్ ఫిలింస్ నిమ్మకు నీరెత్తనట్టు ఉంది. హడావిడి లేదు. హంగామా లేదు. సైలెంట్ గా పోస్ట్ ప్రొడక్షన్ పనులు చేసుకుంటోంది. ఇంకొక్క పాట బాలన్స్ ఉండటంతో త్వరలోనే ఇద్దరు హీరోల కాంబోలో దాన్ని షూట్ చేయబోతున్నారు. ఈ నెలాఖరుకి పూర్తవ్వొచ్చు.
కంటెంట్ పరంగా పోల్చుకుంటే రెండు సినిమాలు నువ్వా నేనా అనే స్థాయిలో ఉన్నాయి. కూలిలో రజనీకాంత్, నాగార్జున, ఉపేంద్ర, అమీర్ ఖాన్ ఊరిస్తుండగా వార్ 2లో జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ ల కాంబో హైప్ ని ఎక్కడికో తీసుకెళ్తోంది. అయితే ఎంత కాన్ఫిడెన్స్ ఉన్నా సరే యష్ రాజ్ బృందం మరీ ఇంత మౌనంగా ఉండటం కరెక్ట్ కాదు. అసలే ఇది హిందీ సినిమా. తెలుగుతో సహా మిగిలిన భాషల్లో డబ్బింగ్ అవుతుంది. కూలి కూడా అంతే కావొచ్చు కానీ తీసింది సౌత్ దర్శకుడు కాబట్టి లోకల్ ఫ్లేవర్ ఎక్కువగా ఉంటుంది. వీలైనంత త్వరగా వార్ 2 పబ్లిసిటీకి తెరతీయాలని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు.