అన్న కొడుకు ఎంట్రీకి మహేష్ బాబు ప్లానింగ్

ఘట్టమనేని కుటుంబం నుంచి మరో హీరో ఎంట్రీకి రంగం సిద్ధమవుతోంది. మహేష్ బాబు అన్నయ్య రమేష్ బాబు కొడుకు జయకృష్ణను లాంచ్ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్టు సమాచారం. కీలకమైన ఈ బాధ్యతను మంగళవారం దర్శకుడు అజయ్ భూపతికి ఇచ్చినట్టు ఫిలిం నగర్ టాక్. రాజకుమారుడుతో మహేష్ ని సోలో హీరోగా ఇండస్ట్రీకి పరిచయం చేసిన నిర్మాత అశ్విని దత్ ఈ ప్రాజెక్టు టేకప్ చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలిసింది. కథ ఓకే అయ్యిందని, స్క్రిప్ట్ తయారు చేసే పనిలో ఉన్నారని, ఎస్ఎస్ఎంబి 29కి బ్రేక్ ఇచ్చారు కాబట్టి మహేష్ ప్రస్తుతం ఈ పనులు పర్యవేక్షిస్తున్నట్టు తెలిసింది.

ఇంత పర్సనల్ గా మహేష్ శ్రద్ధ తీసుకోవడానికి కారణాలు అనేకం. తనకన్నా ముందు హీరోగా తెరంగేట్రం చేసిన రమేష్ బాబు అభిమానుల అంచనాలకు తగ్గట్టు ఎక్కువ కాలం హీరోగా కొనసాగలేదు. సూపర్ స్టార్ కృష్ణ తనవంతుగా పద్మాలయ బ్యానర్ మీద చాలా సినిమాలు తీశారు కానీ వాటిలో సక్సెస్ అయినవి తక్కువ. దీంతో రమేష్ నటన నుంచి విరమించుకుని ఇతర వ్యాపారాలు, నిర్మాణం వైపు వెళ్లిపోయారు. అన్నయ్య నట ప్రయాణం అలా అసంపూర్ణం కావడంతో పాటు వారసుడిని తెరమీద చూడక ముందే కన్నుమూయడం మహేష్ బాబుని జయకృష్ణ మీద ప్రత్యేక ఫోకస్ పెట్టేందుకు దారి తీశాయి.

అధికారిక ప్రకటనతో పాటు పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. జయకృష్ణకు ఫ్యాన్స్ పరంగా మంచి మద్దతు దక్కే అవకాశాలు బోలెడు. కృష్ణ గారి మనవడు, మహేష్ అన్న కొడుకు, రమేష్ వారసుడు ఇలా నేరుగా రక్త సంబంధం ఉన్న హీరో కావడంతో సరైన నటన, కంటెంట్ తో వస్తే మటుకు ఖచ్చితంగా రిసీవ్ చేసుకుంటారు. సుధీర్ బాబుతో పోల్చుకుంటే జయకృష్ణకు సపోర్ట్ ఎక్కువ రావడం సహజం. అందం, రూపంలో మహేష్ కు కాస్త దగ్గరగా అనిపించే జయకృష్ణ ఇప్పటికే నటన, డాన్స్, ఫైట్స్ తదితర అంశాల్లో శిక్షణ తీసుకున్నాడని  సమాచారం. ఒక పెద్ద ఈవెంట్ ద్వారా ఓపెనింగ్ చేయోచ్చని టాక్.