స్వాగ్… వంద కోట్లు పెట్టినా రానంత‌

యూత్ ఫుల్ కామెడీ ఎంట‌ర్టైన‌ర్ల‌తో యువ ప్రేక్ష‌కుల్లో మంచి ఫాలోయింగే సంపాదించాడు శ్రీ విష్ణు. గ‌త ఏడాది అత‌డి నుంచి వ‌చ్చిన స్వాగ్ సినిమా పెద్ద హిట్ అవుతుంద‌నే అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. టీజ‌ర్, ట్రైల‌ర్ అంత ఆస‌క్తిక‌రంగా అనిపించాయి. కానీ సినిమా అంచ‌నాల‌ను అందుకోలేక‌పోయింది. డివైడ్ టాక్‌తో మొద‌లై బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ఫ్లాప్‌గా నిలిచింది. కానీ ఓటీటీలో మాత్రం ఈ సినిమాను జ‌నం బాగానే చూశారు. సోష‌ల్ మీడియాలో కొన్ని రోజుల పాటు సినిమా ట్రెండ్ అయింది. థియేట‌ర్ల‌లో ఆడ‌నంత మాత్రాన‌ ఈ సినిమా విష‌యంలో తాను ఎంత‌మాత్రం రిగ్రెట్ కాలేద‌ని అంటున్నాడు శ్రీ విష్ణు. త‌న కెరీర్లో చాలా స్పెష‌ల్ సినిమాల్లో ఇదొక‌ట‌ని చెప్పాడు.

వంద కోట్ల బ‌డ్జెట్ పెట్టి తీసినా రానంత పేరును త‌న‌కీ సినిమా తీసుకొచ్చింద‌ని శ్రీ విష్ణు తెలిపాడు. ఈ సినిమాను ఓటీటీలో తెలుగు వాళ్లే కాక వేరే భాష‌ల వాళ్లు కూడా బాగా చూశార‌ని.. త‌న‌కు రీచ్ ఎంతో పెరిగింద‌ని శ్రీవిష్ణు తెలిపాడు.
థియేట‌ర్ల‌లో స్వాగ్ బాగా ఆడి నిర్మాత విశ్వ ప్ర‌సాద్‌కు ఇంకా డ‌బ్బులు వ‌చ్చి ఉంటే బాగుండేద‌న్న శ్రీ విష్ణు.. అది త‌ప్పితే సినిమా విష‌యంలో ఏ రిగ్రెట్స్ లేవ‌న్నాడు. తాను డ‌బ్బుల కంటే ముందు పేరు కోసం చూస్తాన‌ని.. స్వాగ్ ఆ పేరును కావాల్సినంత తీసుకొచ్చింద‌ని అత‌ను చెప్పాడు.

ఇక త‌న కొత్త చిత్రం సింగిల్ ట్రైల‌ర్లో కొన్ని డైలాగుల‌పై వివాదం నెల‌కొన‌డం గురించి శ్రీ విష్ణు తెలిపాడు. ట్రైల‌ర్లో డైలాగులకు మంచు విష్ణు ఫీల‌య్యార‌ని తెలిసిన వెంట‌నే ఏమాత్రం ఆల‌స్యం చేయ‌కుండా సారీ చెప్పేశాన‌న్నాడు. అలా చేయ‌క‌పోతే వివాదం పెద్ద‌దై అంద‌రి టైం వేస్ట్ అవుతుంద‌ని.. అందుకే ఏమాత్రం ఆల‌స్యం చేయ‌కుండా సారీ చెబుతూ వీడియో చేశాన‌ని శ్రీ విష్ణు తెలిపాడు. ముందే ఆ ట్రైల‌ర్ మంచు విష్ణుకు చూపిస్తే బాగుండేది క‌దా అన్న అభిప్రాయాల గురించి కూడా శ్రీ విష్ణు స్పందించాడు. తాను మిగ‌తా వాళ్ల‌తో క‌లిపే ట్రైల‌ర్ లాంచ్‌కు కాస్త ముందు ట్రైల‌ర్ చూశాన‌ని.. చాలా రోజుల నుంచే ట్రైల‌ర్ ప‌ని న‌డుస్తోంద‌ని.. 15 ట్రైల‌ర్ల దాకా క‌ట్ చేసి, చివ‌రికి ఒక‌టి ఫైన‌లైజ్ చేశామ‌ని.. అంత త‌క్కువ టైంలో ట్రైల‌ర్ ఇంకొక‌రికి పంపించి అనుమ‌తి తీసుకోవాలి అనిపించ‌లేద‌ని.. అస‌లు అది వివాదం అవుతుంద‌న్న అంచ‌నానే లేద‌ని శ్రీ విష్ణు అన్నాడు.