మోహన్ లాల్ స్ట్రాటజీ సూపర్

మలయాళ ఇండస్ట్రీ బాక్సాఫీస్ లెక్కల్ని ఎప్పటికప్పుడు సవరిస్తూ ఉండే హీరో.. మోహన్ లాల్. ఆ ఇండస్ట్రీలో కలెక్షన్ల రికార్డుల్లో చాలా వరకు మోహన్ లాల్ పేరిటే ఉంటాయి. మాలీవుడ్‌కు తొలి 50 కోట్ల, 100 కోట్ల, 300 కోట్ల మైలురాయిలను పరిచయం చేసింది ఆయనే. దృశ్యం, పులి మురుగన్, ఎంపురాన్ చిత్రాలు వరుసగా ఈ ఘనతలు సాధించాయి. కేవలం నెల వ్యవధిలో రెండుసార్లు వంద కోట్ల కలెక్షన్లను దాటిన తొలి ఇండియన్ హీరోగానూ ఆయన రికార్డు నెలకొల్పారు. మార్చి నెలాఖర్లో వచ్చిన ‘ఎంపురాన్’ ఏకంగా రూ.300 కోట్ల వసూళ్లు సాధించింది. ఇంకో నెల రోజులకే ఆయన్నుంచి రిలీజైన ‘తుడరుమ్’ రూ.150 కోట్ల మార్కు దిశగా దూసుకెళ్తోంది. ఈ రెండు చిత్రాల విషయంలో మోహన్ లాల్ అనుసరించిన స్ట్రాటజీ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

‘ఎంపురాన్’ మూవీ ‘లూసిఫర్’కు సీక్వెల్ కావడం.. పృథ్వీరాజ్ సుకుమారన్ డైరెక్ట్ చేయడం.. భారీ బడ్జెట్ పెట్టడంతో మంచి హైప్ వచ్చింది. ఆ హైప్‌ను ఇంకా పెంచేలా సినిమాను బాగా ప్రమోట్ చేసింది మోహన్ లాల్ అండ్ టీం. రిలీజ్ కూడా భారీగా చేశారు. సినిమాకు మిక్స్డ్ టాక్ వచ్చినా సరే.. ఓపెనింగ్స్ భారీగా రావడంతో సినిమా ఈజీగా బ్రేక్ ఈవెన్‌ దాటేసింది. డివైడ్ టాక్‌ను తట్టుకుని రూ.300 కోట్ల మైలురాయిని అందుకుంది. ఐతే ‘ఎంపురాన్’ థియేట్రికల్ రన్ ముగుస్తున్న సమయంలోనే ‘తుడరుమ్’ను రిలీజ్ చేసేశారు. ఐతే ‘ఎంపురాన్’లా ఇది ఆడంబరమైన సినిమా కాదు. దీనికి పెద్దగా పబ్లిసిటీ కూడా లేదు. మోహన్ లాల్ సహా అందరూ ఈ సినిమాను లైట్ తీసుకున్నట్లుగా కనిపించారు.

కానీ కంటెంట్ మీద వారికి పూర్తి భరోసా ఉందని.. ఆ కంటెంటే సినిమాను జనాల్లోకి తీసుకెళ్తుందని బలంగా నమ్మినట్లున్నారు. వాళ్ల నమ్మకమే నిజమై ‘తుడరుమ్’ బాక్సాఫీస్ దగ్గర అద్భుతాలు చేస్తోంది. జీరో ఎక్స్‌పెక్టేషన్స్‌తో వచ్చిన ఈ చిత్రం.. అదిరిపోయే టాక్ తెచ్చుకుని బాక్సాఫీస్ దగ్గర బలంగా సాగుతోంది. రెండో వీకెండ్లో కూడా సినిమాకు హౌస్ ఫుల్స్ పడుతున్నాయి. కేరళలో ఈ సినిమాకు అదిరిపోయే వసూళ్లు వస్తున్నాయి. ఓవర్సీస్‌లో కూడా దుమ్ముదులుపుతోంది ‘తుడరుమ్’. ఫుల్ రన్లో ఈ చిత్రం రూ.200 కోట్ల మార్కునూ దాటే అవకాశముంది. మొత్తానికి కంటెంట్ వీక్‌గా ఉన్న ‘ఎంపురాన్’కు హైప్ పెంచి సొమ్ము చేసుకున్న మోహన్ లాల్ అండ్ టీం.. విషయం ఉన్న ‘తుడరుమ్’కు డిఫరెంట్ స్ట్రాటజీని అనుసరించి సక్సెస్ కావడం మాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది. ఐతే ఇంత మంచి సినిమాని మన తెలుగు రాష్ట్రాల్లో ప్రమోట్ చెయ్యకపోవడం ఒక రకంగా పెద్ద మైనస్ అని చెప్పవచ్చు. ఒకవేళ ప్రమోట్ చేసి ఉంటే మనవాళ్ళు కంటెంట్ బాగుంటే ఎంత ఆదరిస్తారో అందరికి తెలిసిన విషయమే.