గత ముప్పై రోజులకు పైగా డ్రై పీరియడ్ నరకం చవి చూసిన థియేటర్లకు మళ్ళీ కళ వచ్చేసింది. నాని హిట్ 3 ది థర్డ్ కేస్ అడ్వాన్స్ బుకింగ్స్ చూసి డిస్ట్రిబ్యూటర్లే కాదు ఇతర నిర్మాతలు సైతం ఆనందంగా ఫీలవుతున్నారు. జనం హాళ్లకు ఎందుకు రావడం లేదనే పాయింట్ మీద పరిశ్రమలో రకరకాల చర్చలు జరుగుతున్నాయి. కంటెంట్ క్వాలిటీ గురించి కాకుండా ఫ్లాపులకు సాకులు వెతుకుతున్న వైనం పట్ల సీనియర్ ప్రొడ్యూసర్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఆడియన్స్ టికెట్లు కొని సినిమాలు చూసేందుకు సిద్ధంగా ఉన్నారని, కాకపోతే వాళ్ళలో ఆ ఎగ్జైట్ మెంట్ కలిగించేలా మనమే చేయాలనేది గుర్తించమని చెబుతున్నారు.
హిట్ 3 ఆ పని చేసి చూపిస్తోంది. వయొలెంట్ ట్రైలర్, నాని శ్రీనిధి శెట్టి నాన్ స్టాప్ ఇంటర్వ్యూలు, వివిధ నగరాల్లో ఈవెంట్లు, కొత్త కొత్త విషయాలు పంచుకోవడాలు. కౌంట్ డౌన్ ప్రోమోలు ఇలా పబ్లిసిటీ విషయంలో పక్కా ప్రణాళికతో వెళ్లిన నాని దానికి తగ్గట్టే ఓపెనింగ్స్ రూపంలో భారీ స్పందన దక్కించుకున్నాడు. ఆంధ్రప్రదేశ్ జిఓ ఆలస్యమైనా సరే మూవీ లవర్స్ ఓపికగా ఎదురు చూసి బుక్ చేసుకున్నారంటే నాని మీద నమ్మకం కాక మరేమిటి. దర్శకుడు శైలేష్ కొలను గత సినిమా డిజాస్టర్. మ్యూజిక్ ఇచ్చిన మిక్కీ జె మేయర్ కు యూత్ లో అంత క్రేజ్ లేదు. హీరోయిన్ శ్రీనిధి శెట్టి సినిమాలు చేయడమే తక్కువ.
ఇన్ని ప్రతికూలతలు దాటుకుని హిట్ 3 కి ఇంత హైప్ రావడం వెనుక నాని అనే నమ్మకం తప్ప వేరొకటి కాదు. ఈ ఒక్క మూవీకి ఫ్యామిలీ ఆడియన్స్ వద్దనుకుని మరీ రిస్క్ చేసిన న్యాచురల్ స్టార్ అంచనాలు కనక నిలబెట్టుకోగలిగితే హిందీలోనూ మార్కెట్ పెరుగుతుంది. అనూహ్యంగా అజయ్ దేవగన్ రైడ్ 2, సూర్య రెట్రో కంటే హిట్ 3 బుక్ మై షో అమ్మకాలే ఎక్కువగా ఉండటం చూస్తే నాని తీసుకున్న శ్రద్ధ ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో అర్థం చేసుకోవచ్చు. యుఎస్ ప్రీమియర్స్ టాక్ శుభ సూచకంగా ఉన్నాయి. ఇండియాలోనూ అందులోనూ ఏపీ తెలంగాణలోనూ ఇదే స్పందన కనిపిస్తే మాత్రం దసరా రికార్డులను దాటేయొచ్చు.
Gulte Telugu Telugu Political and Movie News Updates