దృశ్యం రేంజులో ‘తుడరుమ్’ని పొగుడుతున్నారు

ఎల్2 ఎంపురాన్ విడుదలై రెండు నెలలు కాకుండానే మోహన్ లాల్ కొత్త సినిమా తుడరుమ్ నిన్న మలయాళంలో ఇవాళ తెలుగులో రిలీజయ్యింది. మన దగ్గర పెద్ద బజ్ లేదు కానీ కేరళలో ఒక్క రోజులోనే బుక్ మై షోలో 4 లక్షలకు పైగా టికెట్లు అమ్ముడుపోవడం సరికొత్త రికార్డుగా చెప్పుకుంటున్నారు. రెండు దశాబ్దాల తర్వాత మోహన్ లాల్ సరసన సీనియర్ హీరోయిన్ శోభన ఆయనకు భార్యగా నటించడం విశేషం. ఉదయం ఆట నుంచే పాజిటివ్ రివ్యూలు వెల్లువెత్తడంతో క్రమంగా మౌత్ టాక్ దానికి తోడై వసూళ్లకు దోహదం చేస్తోంది. కొందరు ఏకంగా దృశ్యంతో పోలుస్తున్నారు. నిజంగా అంత మ్యాటర్ ఏముందో చూద్దాం.

ఇది దృశ్యం తరహాలో ఫ్యామిలీ థ్రిల్లర్. పాత నల్ల అంబాసడర్ కారుని స్వంత డ్రైవింగ్ లో అద్దెకు తిప్పుకునే బెంజ్ (మోహన్ లాల్) కు కుటుంబమంటే ప్రాణం. భార్య, కొడుకు, కూతురుతో సంతోషంగా ఉంటాడు. ఓ రోజు అనుకోకుండా జరిగిన ఒక సంఘటన వల్ల బెంజ్ పోలీసులకు సహాయం చేయాల్సి వస్తుంది. ఇష్టం లేకపోయినా చేయని నేరంలో భాగమవుతాడు. ఒక్క రోజులో అయిపోతుందనుకుంటే ఆ క్రైమ్ అతని జీవితాన్ని తలకిందులు చేస్తుంది. స్వంత వాళ్ళు ప్రమాదంలో పడతారు. సమాజం ముందు దోషిగా నిలబడతాడు. ఊహించని మలుపులు చోటు తీసుకుని బెంజ్ లో ప్రతీకార వాంఛ మొదలవుతుంది. అదే అసలు కథ.

మొదటి నలభై నిమిషాలు చాలా మాములుగా సాగుతుంది. తర్వాత ట్విస్టుల పర్వం మొదలవుతుంది. పరువు హత్యల పాయింట్ ని తీసుకున్న దర్శకుడు తరుణ్ మూర్తి దానికి ఆసక్తికరమైన స్క్రీన్ ప్లేని జోడించుకోవడంతో ప్రీ ఇంటర్వెల్ నుంచి క్లైమాక్స్ దాకా కథనం పరుగులు పెడుతుంది. అసలు ట్విస్టు మధ్యలో ఊహించేలా ఉన్నా చివరి ఘట్టం మాత్రం సుకుమార్ స్టైల్ లో షాక్ ఇస్తుంది. ఆ సినిమా పేరు చెబితే థ్రిల్ పోతుంది కాబట్టి చెప్పడం భావ్యం కాదు. జేక్స్ బిజోయ్ బీజీఎమ్, ఆర్టిస్టుల పెర్ఫార్మన్స్ ఈ తుడరుమ్ ని డీసెంట్ వాచ్ గా మార్చాయి. మల్లువుడ్ బ్రాండ్ క్రైమ్స్ కి కనక అభిమానులైతే దీన్ని నిక్షేపంగా చూడొచ్చు.