ప్రవస్థి అనే యువ సింగర్.. ఈటీవీలో వచ్చే లెజెండరీ మ్యూజిక్ ప్రోగ్రాం పాడుతా తీయగాలో తనకు జరిగిన అన్యాయంపై తీవ్ర ఆరోపణలు చేయడం చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. సంగీత దర్శకుడు కీరవాణి, గేయ రచయిత చంద్రబోస్, గాయని సునీత తనపట్ల వివక్ష చూపించారని.. తనను టార్గెట్ చేశారని.. షో నిర్వాహకులు సైతం తనను ఇబ్బంది పెట్టారని ఆమె అనేక ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలపై ఇప్పుడు సింగర్ సునీత స్పందించింది. ప్రవస్థి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన ఆమె.. లేని పోని విషయాలను ప్రవస్థి తనకు ఆపాదించుకుని ఫీలవుతోందని అన్నారు. ప్రవస్థిని తానెంతో బాగా చూసుకున్నట్లు ఆమె చెప్పారు. ఇంతకీ సునీత.. ప్రవస్థిని ఉద్దేశించి ఏమన్నారంటే..?
”ప్రవస్థీ.. బాల్యంలో నేనూ నిన్ను ముద్దు చేశా. ఈ వయసులో అలా చేస్తే బాగుండదు కదా? ఎవరూ బాగా పాడినా మేం లీనమై భావోద్వేగానికి గురవుతుంటాం. నువ్వు అన్ని ఎపిసోడ్స్ చూడలేదనుకుంటా. మా గురించి చర్చించే స్థాయికి వెళ్లినందుకు అసంతృప్తిగా ఉంది. నువ్వు ఎన్నో పోటీల్లో పాల్గొన్నావు కదా? వాటిలో ప్రాసెస్ ఎలా ఉంటుందో నీకు తెలియదా? సంగీతం విషయంలో ఛానళ్లకు పరిమితులుంటాయి. కాబట్టి అన్ని పాటలూ పాడే అవకాశం ఉండదు. రైట్స్ ఉన్నవి మాత్రమే పాడాలి. ప్రేక్షకులకు ఇవన్నీ చెబితే సంతోషిస్తా. ప్రతి విషయానికీ నువ్వు అప్సెట్ అయిపోతావు. అమ్మ స్థానంలో నేను అర్థం చేసుకోగలను. వేరే వాళ్లను నేను ఇష్టపడుతున్నా అంటున్నావు. కానీ నువ్వు తప్ప ఎవ్వరూ నాతో ఆల్బమ్స్‌లో పాడలేదు.
నిన్నే నేను ఎందుకు ఎంపిక చేసుకున్నాను? నఏను కూడా పెళ్లి వేడుకల్లో పాడుతుంటా. అనిరుధ్ రవిచందర్ సైతం వెడ్డింగ్ ఈవెంట్లలో పాడారు. నువ్వు అక్కడ పాడావని వివక్ష చూపించడం ఏంటి? మీ అమ్మను నువ్వు అన్నందుకు ఫీలయ్యానన్నావు. మరి ఎలిమినేట్ అయినపుడు ఆమె నన్ను ఉద్దేశించి మాట్లాడిన మాటలు నీకు కరెక్ట్ అనిపించాయా? ఎవరైనా ఓడిపోతే సంతోషించే నీచమైన క్యారెక్టర్ కాదు నీది. సినిమాల్లో మేం పాడిన పాటలు తీసేసిన సందర్భాలుఉన్నాయి. అలా అని మేం నీలా బయటికి వచ్చి ఇంటర్వ్యూలు ఇవ్వలేదు” అని సునీత పేర్కొంది.