నారా రోహిత్.. వార్తలేనా.. నటించేదుందా?

నారా రోహిత్‌ను తెర మీద చూసి చాలా కాలం అయిపోయింది. ఒక ద‌శ‌లో అత‌డి సినిమాలు తొమ్మిది సినిమాలు లైన్లో ఉన్నాయి. రెండు మూడేళ్ల వ్య‌వ‌ధిలో ఆ సినిమాల‌న్నీ రిలీజ‌య్యాయి కూడా. ఐతే వాటిలో మెజారిటీ తీవ్ర నిరాశ‌కు గురి చేశాయి. అలా మొద‌లైన ప‌రాజ‌య ప‌రంప‌రం నిరాటంకంగా సాగిపోయింది. గ‌త నాలుగేళ్లలో రోహిత్ నుంచి ఒక్క హిట్టు సినిమా కూడా రాలేదు.

గ‌త రెండేళ్ల‌లో నారా రోహిత్ సినిమాలు చేయ‌డ‌మే మానేశాడు. చివ‌ర‌గా వీర భోగ వ‌సంత‌రాయ‌లులో న‌టించాడ‌తను. ఆ సినిమా ఫ‌లితం గురించి తెలిసిందే. అన‌గ‌న‌గా ద‌క్షిణాదిన పేరుతో ఒక భారీ సినిమాను మొద‌లుపెట్టిన‌ట్లే పెట్టి ఆపేసిన రోహిత్.. మ‌రే కొత్త సినిమాను ప్ర‌క‌టించ‌లేదు. ఈ మ‌ధ్య బ‌రువు త‌గ్గి, లుక్ మార్చుకునేస‌రికి కొత్త సినిమా ప్ర‌క‌ట‌న ఉంటుంద‌నే సంకేతాలు క‌నిపించాయి. కానీ చ‌ప్పుడు లేదు.

రోహిత్ కొత్త సినిమాల గురించి అప్పుడ‌ప్పుడూ ఆస‌క్తిక‌ర ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కానీ ఏదీ కార్య‌రూపం దాల్చ‌ట్లేదు. కొన్ని రోజుల కింద‌ట పుష్ప‌లో ఓ పాత్ర కోసం రోహిత్‌ను క‌న్సిడ‌ర్ చేస్తున్నార‌ని, అల్లు అర్జునే అత‌ణ్ని సుక్కుకు సిఫార‌సు చేశాడ‌ని వార్త‌లొచ్చాయి. క‌ట్ చేస్తే అలాంటిదేమీ లేద‌ని తేలిపోయింది. తాజాగా నాని చేయ‌బోతున్న ప్రెస్టీజియ‌స్ మూవీ శ్యామ్ సింగ‌రాయ్‌లో నారా రోహిత్ ఓ కీల‌క పాత్ర చేయ‌నున్న‌ట్లు వార్త‌లొస్తున్నాయి.

ట్యాక్సీవాలా ద‌ర్శ‌కుడు రాహుల్ సంకృత్య‌న్ తెర‌కెక్కించిన ఈ సినిమా నాని కెరీర్లోనే అత్యధిక బ‌డ్జెట్లో, భారీత‌నంతో తెర‌కెక్క‌నుంది. ఇలాంటి వైవిధ్య‌మైన సినిమాలో రోహిత్ న‌టించాడంటే అత‌డి కెరీర్‌కు మంచిదే. కానీ ఇలా వార్త‌లు రావ‌డ‌మే త‌ప్ప రోహిత్ సినిమాలేవీ ప‌ట్టాలైతే ఎక్క‌ట్లేదు. మ‌రి ఈ వార్త అయిన నిజం అయి ఈ టాలెంటెడ్ హీరో మ‌ళ్లీ తెర‌పై క‌నిపిస్తాడేమో చూడాలి.