వామ్మో… ‘ఫౌజీ’ మీద అంత బడ్జెట్టా?

ప్రభాస్ సినిమా అంటే చాలు.. వందల కోట్ల బడ్జెట్, అంతకుమించిన బిజినెస్ మామూలైపోయింది. ప్రభాస్ ఈ మధ్య చేసిన వాటిలో కొంచెం చిన్న స్థాయి సినిమా అనుకున్న ‘రాజా సాబ్’కు సైతం బడ్జెట్ రూ.400 కోట్లు దాటిపోవడం విశేషం. ప్రభాస్‌తో మిడ్ రేంజ్ సినిమా తీద్దామని మొదలుపెట్టినా.. అది పెద్ద బడ్జెట్ మూవీనే అవుతోంది. రెబల్ స్టార్ హీరోగా ‘సీతారామం’ దర్శకుడు హను రాఘవపూడి దర్శకత్వంలో గత ఏడాది ఒక చిత్రం మొదలైన సంగతి తెలిసిందే. దీనికి ‘ఫౌజీ’ అనే వర్కింగ్ టైటిల్ అనుకున్నారు.

ఇందులో ఇమాన్వి అనే సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌ను కథానాయికగా ఎంచుకుని పెద్ద షాకిచ్చాడు హను. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి బడ్జెట్ కొంచెం తక్కువగానే ఉంటుందిలే అనుకున్నారంతా. కానీ ఈ చిత్రం మీద మైత్రీ వాళ్లు ఏకంగా రూ.600 కోట్లు ఖర్చు చేస్తున్నారట. పేరుకు ఇది లవ్ స్టోరీనే అయినప్పటికీ.. వార్ బ్యాక్ డ్రాప్ ఉంటుందని.. దేశ విదేశాల్లో భారీ లొకేషన్లలో చిత్రీకరణ జరుగుతోందని.. ప్రొడక్షణ్ కాస్ట్ బాగానే అవుతోందని సమాచారం.

ఇక ప్రభాస్‌కు భారీగా పారితోషకం ఇవ్వాల్సి ఉంటుంది. మిగతా రెమ్యూనరేషన్లు ఉండనే ఉన్నాయి. అన్నీ కలిపితే బడ్జెట్ రూ.600 కోట్లు దాటిపోతున్నట్లు సమాచారం. మైత్రీ వాళ్లు బడ్జెట్ విషయంలో అస్సలు రాజీ పడరనే పేరుంది. ‘పుష్ప’ రెండు భాగాల మీద భారీగా ఖర్చు పెట్టారు. అందుకు తగ్గ ఫలితాన్నందుకున్నారు. ఇప్పుడు ‘ఫౌజీ’ మీద తమ సంస్థ చరిత్రలోనే అత్యధిక బడ్జెట్ పెడుతున్నారు. ప్రభాస్‌కు ఉన్న తిరుగులేని మార్కెట్ దృష్ట్యా ఈ బడ్జెట్‌ను వర్కవుట్ చేయడం కష్టమేమీ కాదని మైత్రీ అధినేతలు భావిస్తున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది ద్వితీయార్దంలో విడుదలయ్యే అవకాశముంది.