రివ్యూలపై కుండబద్దలుకొట్టిన నాని

టాలీవుడ్లో బాక్సాఫీస్ స్లంప్ వచ్చినపుడల్లా.. నిర్మాతల దృష్టి రివ్యూల మీద పడుతోంది. సినిమాలు దెబ్బ తినడానికి రివ్యూలే కారణమంటూ వాటి మీద పడిపోతున్నారు. ఓటీటీల విప్లవం తర్వాత ప్రేక్షకుల ఆలోచన తీరు మారిపోయి.. థియేటర్లకు రావడం తగ్గిపోయిన మాట వాస్తవం. నిర్మాతలు డిజిటల్ ఆదాయం మీద ఆశతో థియేట్రికల్ రిలీజ్, ఓటీటీ రిలీజ్‌కు మధ్య అంతరాన్ని అంతకంతకూ తగ్గించేస్తున్నారు. ఓటీటీలకు అలవాటు పడ్డ ప్రేక్షకులు థియేటర్లకు అంత తేలిగ్గా కదలట్లేదు. వాళ్లను ఎగ్జైట్ చేసే సినిమా వస్తేనే థియేటర్ల వైపు చూస్తున్నారు. అది కూడా రివ్యూలు, టాక్‌ను బట్టే టికెట్లు కొంటున్నారు. వాస్తవం ఇదైనప్పటికీ.. థియేటర్లు ఖాళీ అవుతుండడానికి రివ్యూలు కారణమంటూ వాటిని ఆపడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.

సినిమా రిలీజైన కొన్ని రోజుల వరకు రివ్యూలు బయటికి రాకుండా నిబంధన తేవాలనే వాదన వినిపిస్తోంది. లేటెస్ట్‌గా కూడా టాలీవుడ్లో దీని మీద ఒక మీటింగ్ జరిగినట్లు చర్చ జరుగుతోంది. ఇలాంటి టైంలో రివ్యూల మీద హీరో కమ్ ప్రొడ్యూసర్ నాని తన అభిప్రాయాన్ని స్ఫష్టంగా చెప్పేశాడు. రివ్యూలను ఎవరు ఆపగలరని నాని ఓ ఇంటర్వ్యూలో ప్రశ్నించడం విశేషం. రివ్యూలు కొన్ని రోజులు ఆగడం అన్నది జరగదని నాని స్పష్టం చేశాడు. ఒక రోజు ఆగొచ్చు.. రెండు మూడు రోజులు ఆగొచ్చు కానీ.. రివ్యూలు పూర్తిగా ఆగవని నాని అన్నాడు. మన చిన్నతనంలో అంటే వెంటనే రివ్యూలు బయటికి రావడానికి స్కోప్ లేకపోయిందని.. అందుకు మీడియం లేదని.. కానీ ఇప్పుడు సోషల్ మీడియా కాలంలో రివ్యూలు ఎలా ఆగుతాయని నాని అన్నాడు.

ఎవరిని ఆపుతారు.. ఎందుకు ఆపుతారు.. ఎలా ఆపుతారు అని నాని ప్రశ్నించాడు. ఐతే రివ్యూలు రాసే వాళ్లకు నాని ఒక సలహా ఇచ్చాడు. ఫలానా సీన్ లేదా సినిమా మాకు నచ్చలేదు అని చెప్పాలి కానీ.. ఇది ఆడదు అని డిసైడ్ చేయొద్దు అని నాని విన్నవించాడు. సినిమా డిజాస్టర్ అని కూడా తొలి రోజే డిసైడ్ చేయొద్దని.. వారం పది రోజుల పాటు సినిమాను ఎవరూ చూడకపోతే అప్పుడు నిర్ణయించొచ్చని నాని అన్నాడు. ఫేస్‌బుక్‌లో, ట్విట్టర్లో ఎవరో సినిమా చూస్తే తలనొప్పి వచ్చేసిందని అంటుంటారని.. అలా మీడియా కూడా రాస్తోందని.. అది తప్పని నాని అభిప్రాయపడ్డాడు.