ఇంకో ఎనిమిది రోజుల్లో విడుదల కాబోతున్న హిట్ 3 ది థర్డ్ కేస్ కోసం నాని చేస్తున్న ప్రమోషన్లు జాతీయ మీడియాలోనూ హైలైటవుతున్నాయి. హీరోయిన్ శ్రీనిధి శెట్టితో పాటు ఇస్తున్న ఇంటర్వ్యూల్లో పంచుకుంటున్న విశేషాలు క్రమంగా నార్త్ ఆడియన్స్ దృష్టిలో పడుతున్నాయి. కంటెంట్ మీద చాలా నమ్మకంగా ఉన్న నాని ఎక్కడికి వెళ్లినా అదే కాన్ఫిడెన్స్ చూపిస్తున్నాడు. ట్రైలర్ లో చూపించిన వయొలెన్స్ మీద కామెంట్స్ వచ్చినా థియేటర్లో చూశాక మీ అభిప్రాయం చెప్పమంటూ ఓపెన్ గా అడుగుతున్నాడు. ఇదిలా ఉండగా నార్త్ లో పెద్ద రిలీజ్ ప్లాన్ చేసుకున్న హిట్ 3కి రెండు సమస్యలు ఎదురయ్యేలా ఉన్నాయి.
ముంబై టాక్ ప్రకారం హిట్ 3 ఓటిటి డీల్ నాలుగు వారాలకు జరిగిందట. ఉత్తరాది మల్టీప్లెక్సుల నిబంధనల ప్రకారం ఏదైనా సినిమా యాభై రోజుల కన్నా తక్కువ అగ్రిమెంట్ చేసుకుంటే వాటిని తమ సముదాయాల్లో ప్రదర్శించరు. సింగల్ స్క్రీన్లు, అసోసియేషన్ గొడుగు కిందకు రాని జాయింట్ థియేటర్లలో మాత్రమే వేసుకోవాల్సి ఉంటుంది. హిట్ 3ని నాని నెట్ ఫ్లిక్స్ కి ఇచ్చాడు. తన నిర్మాణంలో వచ్చిన కోర్ట్, అంతకు ముందు హీరోగా చేసిన సరిపోదా శనివారం, హాయ్ నాన్న, దసరా లాంటి వన్నీ ఫోర్ వీక్ విండోనే వచ్చాయి. కాబట్టి హిట్ 3 ది థర్డ్ కేస్ అదే బాట పట్టిందని రిపోర్ట్. అధికారికంగా దీని గురించి ఇంకా చెప్పలేదు.
రెండో సమస్య అజయ్ దేవగన్ రైడ్ 2 అదే రోజు పెద్ద ఎత్తున రిలీజవుతోంది. డిస్ట్రిబ్యూషన్ నెట్ వర్క్ బలంగా ఉన్న టి సిరీస్ నిర్మాణం కావడంతో ఉత్తరాది రాష్ట్రాల్లో వీలైనన్ని ఎక్కువ స్క్రీన్లు ఇవ్వబోతున్నారు. సక్సెస్ రేట్ పరంగా బాలీవుడ్ ముందు వరసలో ఉన్న అజయ్ దేవగన్ మూవీ కావడంతో బయ్యర్ల ఆసక్తి కూడా ఎక్కువగా ఉంది. అదే జరిగితే హిట్ 3కి కౌంట్ విషయంలో రాజీ తప్పకపోవచ్చు. ఇదంతా ఎలా ఉన్నా నాని మాత్రం ష్యుర్ షాట్ బ్లాక్ బస్టర్ అనే కాన్ఫిడెన్స్ తో ప్రమోట్ చేసుకుంటున్నాడు. వీలైతే అన్ని చోట్లా ముందు రోజు ప్రీమియర్లు వేసే ఆలోచన కూడా ఉంది. ఇంకో నాలుగైదు రోజుల్లో క్లారిటీ వస్తుంది.