కళ్యాణ్ రామ్ క్యాలికులేషన్ ఎందుకు తప్పింది

ఏడాదికి పైగా వెయిట్ చేసి మరీ అర్జున్ సన్నాఫ్ వైజయంతితో ప్రేక్షకుల ముందుకొచ్చిన కళ్యాణ్ రామ్ తాను కోరుకున్న స్థాయిలో బ్లాక్ బస్టర్ అందుకోవడం కష్టమే అనిపిస్తోంది. వసూళ్లు దాన్నే స్పష్టం చేస్తున్నాయి. మొన్న వీకెండ్ పర్వాలేదనిపించినప్పటికీ సూపర్ హిట్ అనిపించుకునే ఫిగర్లు నమోదు కాకపోవడం చూసి అభిమానులు షాకవుతున్నారు. అపోజిషన్ లో వచ్చిన ఓదెల 2 వీక్ ఉన్నా ఆ అవకాశాన్ని వాడుకోలేకపోవడంతో థియేటర్ల దగ్గర హౌస్ ఫుల్స్ పడలేదు. ఎండలు, ఐపీఎల్ మ్యాచులు లాంటి అడ్డంకులు ఉన్నా సరే యునానిమస్ టాక్ వస్తే ఆడియన్స్ వాటిని పట్టించుకోరనే సత్యం గతంలో ఋజువయ్యింది.

మొత్తంగా చూస్తే కళ్యాణ్ రామ్ లెక్క పలు విషయాల్లో తప్పడం కనిపిస్తుంది. క్లైమాక్స్ ని అతిగా నమ్మేసి, అది ఆడియన్స్ ని షాక్ కి గురి చేయడమే కాక, కన్నీటి పర్యంతం చేసి కుటుంబాలను థియేటర్లకు తీసుకొస్తుందని బలంగా నమ్మాడు. నిజానికి ఆ చివరి ఘట్టంలో షాక్ వేల్యూ ఉంది కానీ మరీ కళ్యాణ్ రామ్ ఊహించుకున్నంత కాదనేది పబ్లిక్ టాక్, సోషల్ మీడియా రివ్యూస్ స్పష్టం చేశాయి. ఒకవేళ నిజంగా అది అంత ఇంపాక్ట్ చూపించి ఉంటే కిరణ్ అబ్బవరం ‘క’లాగా దాని గురించి ప్రత్యేకంగా మాట్లాడుకునే వాళ్ళు. కానీ అలా జరగలేదు. సగటు కమర్షియల్ మీటర్ లో సాగిన అర్జున్ సన్నాఫ్ వైజయంతిలో కొత్తదనం మిస్ కావడం మరో లోపం.

ఇక విజయశాంతి మీదున్న గౌరవం, ఒకప్పటి వింటేజ్ ఇమేజ్ నిన్నటి తరం అభిమానుల్లో ఆసక్తి రేపుతుందేమో కానీ ప్రస్తుత జనరేషన్ కి ఆవిడొక సీనియర్ నటి అంతే. రమ్యకృష్ణ లాగా రెగ్యులర్ గా కనిపించకపోవడంతో కనెక్టివిటీ తగ్గిపోయింది. సరిలేరు నీకెవ్వరులోనూ లేడీ అమితాబ్ పాత్ర కన్నా ఇతర ఎలిమెంట్స్ విజయంలో కీలక పాత్ర పోషించాయి. ఇక అజనీష్ లోకనాథ్ ని ఇలాంటి మాస్ మూవీకి తీసుకోవడం తేడా కొట్టించేసింది. బ్రేక్ ఈవెన్ కి దూరంలో ఉన్న అర్జున్ సన్నాఫ్ వైజయంతికి రెండో వీకెండ్ ఇంకో ఛాన్స్ ఉంది. దాని వాడుకుంటే అద్భుతమే అని చెప్పాలి. కానీ ఒక్కసారిగా ఆక్యుపెన్సీలు పెరుగుతాయా. ఏమో చూద్దాం.