సినిమాలను ప్రమోట్ చేసుకునే విషయంలో హీరోలందరూ ఒకేలా శ్రద్ధ తీసుకోరు. కొందరు నటించగానే పనైపోయిందని భావిస్తే మరికొందరు దేశమంతా తిరిగి పబ్లిసిటీలో భాగమవుతారు. ఇంకొందరు ఫలితం ముందే ఊహించి అంటీ అంటనట్టు మొక్కుబడిగా వాటిలో పాల్గొంటారు. ఈ మూడు తరహా స్టార్లను మనం గత నాలుగు నెలల కాలంలోనే చూసేశాం. న్యాచురల్ స్టార్ నాని తాను వేరే లెవలని నిరూపించే పనిలో ఉన్నాడు. సూర్య రెట్రో పోటీని నిలువరించడంతో పాటు ప్యాన్ ఇండియా స్థాయిలో హీట్ 3 ది థర్డ్ కేస్ ని జనంలోకి బలంగా తీసుకెళ్లాలని భావించి దానికి తగ్గట్టే కొత్త స్ట్రాటజీలు రచిస్తున్నాడు.
అందులో భాగంగా అన్నపూర్ణ స్టూడియోస్ లో ప్రత్యేకంగా వేయించిన హిట్ 3 సెట్ ఇప్పుడు టాక్ అఫ్ ది ఇండస్ట్రీగా మారింది. మీడియా ప్రతినిధులు, జర్నలిస్టులు అక్కడికే వెళ్లి ఇంటర్వ్యూలు తీసుకునేలా ఏర్పాట్లు చేశారు. సినిమాలో వాడిన కత్తులు కటార్లు, మారణాయుధాలు, పోలీస్ లాకప్, తుపాకీలు, బుల్లెట్లు, ఇంటరాగేషన్ రూములు, ఊచలు, జైలు గదులు ఒకటేమిటి ఇదంతా వాడుకుని ఏకంగా ఒక సినిమా తీయొచ్చనే రేంజ్ లో ఆర్ట్ డిపార్ట్ మెంట్ కష్టపడింది. చూడగానే ఆసక్తి రేపేలా భయపెట్టేలా ఉన్న ఈ సెట్ వర్క్ చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. దాని గురించి మాట్లాడుకుంటున్నారు.
ఇక్కడితో అయిపోలేదు. రిలీజ్ డేట్ ఇంకో పదమూడు రోజుల్లోనే ఉంది. అగ్రెసివ్ ప్రమోషన్లతో నాని అన్ని భాషల్లోకి దీన్ని తీసుకెళ్ళబోతున్నాడు. తమిళనాడు, కేరళ, కర్ణాటకలో ప్రత్యేక మీట్లు ఉండబోతున్నాయి. ఓపెనింగ్స్ పరంగా నాని చాలా నమ్మకంగా ఉన్నాడు. ఫిబ్రవరి నుంచి చూసుకుంటే టాలీవుడ్ లో చెప్పుకోదగ్గ స్టార్ క్యాస్టింగ్ ఉన్న సినిమాలు మూడు నాలుగు మాత్రమే ఆడాయి. జనం మండుటెండల్లో థియేటర్లకు రావాలంటే ఎక్స్ ట్రాడినరి టాక్ ఆశిస్తున్నారు. అది కనక హిట్ 3 తెచ్చుకుంటే యానిమల్, సలార్ లాగా సెన్సార్ ఏ సర్టిఫికెట్ ఇచ్చినా సరే బాక్సాఫీస్ దగ్గర వసూళ్లు పోటెత్తుతాయి.