సంపత్ నంది.. ఏమైంది ఈవేళ లాంటి చిన్న సినిమాతో పరిచయమై, రెండో చిత్రానికే రామ్ చరణ్‌తో పని చేసే అవకాశం అందుకుని సెన్సేషన్ క్రియేట్ చేసిన దర్శకుడు. చరణ్‌తో అతను చేసిన రచ్చ పెద్ద హిట్టే అయింది. ఆ తర్వాత అతడికి ఏకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తోనే సినిమా చేసే అవకాశం వచ్చింది. కానీ దాదాపు రెండేళ్లు ఈ ప్రాజెక్టు మీద పని చేసిన తర్వాత ఎక్కడో తేడా జరిగి అతను దాన్నుంచి బయటికి వచ్చేశాడు. ఆ తర్వాత బెంగాల్ టైగర్ మూవీ చేశాడు. ఐతే పవన్ వల్ల సంపత్ కెరీర్లో విలువైన సమయం వృథా అయిందని, అతను చాలా నష్టపోయాడని పవర్ స్టార్ మీద కొందరు విమర్శలు గుప్పిస్తుంటారు. ఇలాంటి వాళ్లందరికీ ఒక ఇంటర్వ్యూలో సమాధానం ఇచ్చాడు సంపత్.
తాను స్క్రిప్టు అందించడంతో పాటు నిర్మాణంలోనూ భాగస్వామి అయిన ఓదెల-2 రిలీజ్ నేపథ్యంలో ఇచ్చిన ఈ ఇంటర్వ్యూలో పవన్‌తో ప్రాజెక్టు క్యాన్సిల్ కావడం గురించి సంపత్ ఏమన్నాడంటే.. ”నేను పవన్ కళ్యాణ్ గారితో నా కథ చేద్దామనే వెళ్లాను. ఆయనకు ముందుగా నేను చెప్పింది బెంగాల్ టైగర్ కథే. కానీ రవితేజతో చేసినట్లు ఉండదు. ఆ కథ ఆయనకు నచ్చింది. డైలాగ్స్ కూడా నచ్చాయి. కానీ ఆయన వేరే కథ చేద్దామన్నారు. ఆ కథ చెప్పి దాని మీద వర్క్ చేయమన్నారు. అలా ఏడాదిన్నర పాటు దాని మీద పని చేశాను. కానీ మా ఇద్దరి ఆలోచనలు భిన్నంగా ఉన్నాయి.
వేర్వేరు దారిలో వెళ్తున్నాం అనిపించింది. అందుకే ఆ ప్రాజెక్టు నుంచి నేను బయటికి రావాల్సి వచ్చింది. అందులో తప్పేమీ లేదు. ఒక కథ వర్కవుట్ కాకపోతే వేరేది చేసి మెప్పించాలి. నేను పని చేసిన ఏడాదిన్నర సమయానికి నాకు పవన్ గారు డబ్బులు కూడా ఇప్పించారు. ఇప్పటికీ ఆయనతో నాకు మంచి సంబంధాలు ఉన్నాయి. నాకు తర్వాత కూడా ఆయన వేరే నిర్మాత ద్వారా కబురు పంపారు. సినిమా చేద్దామన్నారు. కానీ ఇప్పుడు ఆయనకు ఖాళీ లేదు. వీలైనపుడు కచ్చితంగా ఆయనతో సినిమా చేస్తా. పవన్ గారి గురించి మనం ఏమీ కామెంట్ చేయకూడదు. ఆయనెంత మంచివాడో అందరికీ తెలుసు. నాకు కొంచెం ఎక్కువే తెలుసు” అని సంపత్ నంది స్పష్టం చేశాడు.
Gulte Telugu Telugu Political and Movie News Updates