బాక్సాఫీస్ వార్ – ఆత్మ ఎలివేషన్ VS అమ్మ ఎమోషన్

థియేటర్లలో జనాలు లేక అలో లక్ష్మణా అంటూ అల్లాడిపోతున్న బయ్యర్లకు ఊరట కలిగించేందుకు ఈ వారం రెండు చెప్పుకోదగ్గ సినిమాలు వస్తున్నాయి. వాటిలో మొదటిది ‘ఓదెల 2’ ఒక రోజు ముందే రేపు గురువారం ప్రేక్షకుల ముందుకొస్తున్న విషయం తెలిసిందే. తమన్నా, సంపత్ నంది ఎడతెరిపి లేకుండా ప్రమోషన్లు చేసుకుంటూనే ఉన్నారు. బిజినెస్ వర్గాల్లో దీనికి క్రేజ్ ఉంది కానీ సాధారణ జనాలు ఎలా రిసీవ్ చేసుకుంటారనేది రేపు మార్నింగ్ షో అయ్యాక బయటికి వస్తుంది. పాజిటివ్ అయితే మాత్రం మా ఊరి పొలిమేర 2, విరూపాక్ష తరహాలో ఆడియన్స్ నుంచి మద్దతుతో పాటు కలెక్షన్లు ఆశించవచ్చు.

చనిపోయిన మనిషి ఆత్మ తిరిగి ఊళ్లోకి వచ్చి అరాచకం సృష్టిస్తే శివశక్తి అయిన ఒక మహిళ ఏం చేసిందనే పాయింట్ మీద ఓదెల 2 రూపొందింది. తర్వాత శుక్రవారం రాబోతున్న ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ మీద కళ్యాణ్ రామ్ పెట్టుకున్న నమ్మకం అంతా ఇంతా కాదు. తమ్ముడు జూనియర్ ఎన్టీఆర్ ఈవెంట్ కొచ్చి సపోర్ట్ చేయడమే కాకుండా సినిమా చూసి మరీ బాగుందని కితాబు ఇవ్వడం ఓపెనింగ్స్ పరంగా ఉపయోగపడనుంది. ముఖ్యంగా విజయశాంతి పోషించిన అమ్మ పాత్రను ఎక్కువగా హైలైట్ చేస్తున్న టీమ్ పదిహేను నిమిషాల క్లైమాక్స్ లో కంటతడి పెట్టడం ఖాయమని చెప్పడం ఫ్యామిలీ వర్గాలను టార్గెట్ చేయడమే.

రెండు సినిమాలకు తమకంటూ బలాలు బలహీనతలున్నాయి. ఓదెల 2 ట్రైలర్ లో ఎంత ఇంటెన్సిటీ ఉన్నా హారర్ ఎలిమెంట్స్ అరుంధతి తరహాలో కనిపించడాన్ని ఎలా జస్టిఫై చేశారన్నది సక్సెస్ లో కీలకం కానుంది. ప్లస్ పాయింట్స్ కోణంలో తమన్నా ఇమేజ్ ఎలాగూ ఉపయోగపడుతుంది. ఇక అర్జున్ సన్నాఫ్ వైజయంతిలో ఎంత తల్లి ఎమోషన్ హైలైట్ అయినా ఇది సగటు కమర్షియల్ ఎంటర్ టైనరే. రొటీన్ అనిపించకుండా రెండున్నర గంటలు ఎంగేజ్ చేస్తే పటాస్ లాగా కళ్యాణ్ రామ్ ఖాతాలో హిట్టు పడుతుంది. అన్నట్టు పోటీలో తలపడుతున్న కళ్యాణ్ రామ్, తమన్నా జంటగా ఏడేళ్ల క్రితం ‘నా నువ్వే’లో నటించడం కొసమెరుపు.