మూడో అడుగు జాగ్రత్త విశ్వంభరా

మెగాస్టార్ ఫాంటసీ మూవీ విశ్వంభర నుంచి ప్రమోషన్ పరంగా ఇప్పటిదాకా రెండు కంటెంట్స్ వచ్చాయి. మొదటిది టీజర్. దీనికొచ్సిన నెగటివిటీ ఏకంగా రిలీజ్ డేట్ ని వాయిదాలు వేయించడంతో పాటు ఓటిటి డీల్స్ ఆలస్యమయ్యేలా చేసింది. సరే దీని వల్ల జరిగిన డ్యామేజ్ పెద్దదే అయినా టీమ్ వెంటనే మేల్కొని విఎఫెక్స్ కోసం ప్రత్యేక టీమ్ ఏర్పాటు చేసి ప్రతి ఒక్కటి పర్ఫెక్ట్ గా వచ్చేలా చూసుకుంటోంది. చిరంజీవి సూచన మేరకు దర్శకుడు వశిష్టకు సలహాలు అందించేందుకు వివి వినాయక్, నాగ్ అశ్విన్ లాంటి వాళ్ళు తమ వంతు సాయం చేస్తున్నారనే టాక్ ఉంది కానీ ఎంతవరకు నిజమనేది చెప్పలేం.

ఇటీవలే విడుదలైన రామ రామ ఫస్ట్ ఆడియో సింగల్ ఆశించిన స్థాయిలో జనాలకు రీచ్ కావడం లేదు. కీరవాణి కంపోజ్ చేసిన ట్యూన్ బాగున్నా ఆడియన్స్ లోకి త్వరగా దూసుకెళ్లే ట్రెండీనెస్ లేకపోవడం ఫ్యాన్స్ ని నిరాశపరిచింది. రఘుకుల తిలక రామా అంటూ సాగే ఒక ప్రైవేట్ సాంగ్ ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాని ఊపేస్తోంది. వాళ్ళేమి పబ్లిసిటీ చేయలేదు. పాట బాగుంది కనక సామజిక మాధ్యమాల్లో వైరల్ అయిపోయింది. దానికొచ్చిన రెస్పాన్స్ చూసి కొందరు దర్శకులు ఒరిజినల్ కంపోజర్ ని కలిసి హక్కులు కొనే పనిలో పడ్డారట. ట్రూ ఛార్ట్ బస్టర్ అంటే ఇలా ఎవరూ చెప్పకపోయినా వైరల్ అయిపోవడం.

విశ్వంభర నుంచి జనం, అభిమానులు కోరుకున్నది అచ్చం ఇలాంటిదే. సరే తెరమీద చూశాక అభిప్రాయం మారుతుందేమో కానీ ముందు విశ్వంభర బృందం చేయాల్సిన పని ఒకటుంది. నెక్స్ట్ వదలబోయే మూడో ప్రమోషనల్ కంటెంట్ ప్రత్యేకంగా ఉండాలి. అంచనాలు పెంచేలా మేజిక్ చేయాలి. కొత్త టీజరా లేక ట్రైలరా లేక చాలా బాగుందనిపించిన మరో పాటనా ఏదో ఒకటి బిజినెస్ డిమాండ్ పెరిగే స్థాయిలో హడావిడి జరగాలి. అసలు ఎప్పుడో వచ్చే అనిల్ రావిపూడి సినిమా కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు తప్పించి విశ్వంభర హైప్ తక్కువగా ఉంది. ముందైతే దీని మీద ఫోకస్ వచ్చేలా చేయడం అవసరం.