దర్శకుడు ప్రశాంత్ వర్మకి హనుమాన్ కన్నా ముందు కమర్షియల్ గా బ్రేక్ ఇచ్చిన సినిమా జాంబీ రెడ్డి. అప్పటిదాకా టాలీవుడ్ కు పెద్దగా పరిచయం లేని జాంబీ హారర్ కు రాయలసీమ కామెడీని కలగలిపి చేసిన ప్రయోగం బాక్సాఫీస్ దగ్గర మంచి ఫలితాన్ని ఇచ్చింది. సోలో హీరోగా తేజ సజ్జ ఫిల్మోగ్రఫీలో మొదటి హిట్టు పడింది. ఇదంతా జరిగి నాలుగేళ్లు గడిచిపోయాయి. అప్పటి నుంచి సీక్వెల్ కోసం ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు కానీ ప్రశాంత్ వర్మ వర్క్ చేయడమే తప్ప బయటకి చెప్పడం జరగలేదు. ఇప్పుడా దిశగా చర్యలు జరుగుతున్నట్టు సమాచారం. హీరో తప్ప ఈసారి దర్శకుడు, బడ్జెట్ వగైరాలు మారబోతున్నాయట.
సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై రానా నాయుడు ఫేమ్ సుపర్న్ వర్మ దర్శకత్వంలో జాంబీ రెడ్డి 2 కోసం సుమారు వంద కోట్లకు పైగా బడ్జెట్ కేటాయించబోతున్నట్టు సమాచారం. ఇంకా అధికారిక ప్రకటన రాలేదు కానీ ప్రస్తుతం ప్రశాంత్ వర్మ టీమ్ ఫైనల్ టచ్ అప్ పనుల్లో బిజీగా ఉందని తెలిసింది. ఈసారి కథని కేవలం సీమకే పరిమితం చేయకుండా ప్యాన్ ఇండియా స్థాయిలో వివిధ నగరాల్లో జాంబీలు విరుచుకుపడితే అప్పుడు హీరో ఏం చేశాడనే పాయింట్ మీద రూపొందుతుందని వినిపిస్తోంది. బడ్జెట్, స్కేల్, క్యాస్టింగ్ తదితర విషయాల్లో ఎవరూ ఊహించని స్థాయిలో సర్ప్రైజులు ఉండబోతున్నాయని వినికిడి.
హనుమాన్ తర్వాత కెరీర్ ని జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్న తేజ సజ్జ నెక్స్ట్ సినిమా మిరాయ్ ఆగస్ట్ 1 విడుదల కానున్న సంగతి తెలిసిందే. దీని కోసం కుర్రాడు ఏకంగా రెండు సంవత్సరాలు కష్టపడ్డాడు. ఆ తర్వాత జాంబీ రెడ్డి 2 ఉండే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. లార్జర్ దాన్ లైఫ్ సూపర్ హీరో కథల్లో తేజ సజ్జ ఒదుగుతున్న తీరు ఆలాంటి అవకాశాలే తీసుకొస్తోంది. తన సినిమాటిక్ యునివర్స్ లో జాంబీ రెడ్డిని ఒక భాగం చేయబోతున్న ప్రశాంత్ వర్మ క్రమంగా హనుమాన్, జై హనుమాన్, మహాకాళి, అధీర, బ్రహ్మ్ రాక్షస్ తదితరులతో ఒక మల్టీస్టారర్ ని భవిష్యత్తులో ప్లాన్ చేస్తాడట. నిజమైతే దీని బడ్జెట్ ఊహించలేమేమో.