తన పాటలు, ట్యూన్లు ఎవరు వాడుకున్నా వాళ్ళను విడిచిపెట్టే విషయంలో రాజీపడని ధోరణి ప్రదర్శించే ఇళయరాజా ఈసారి గుడ్ బ్యాడ్ అగ్లీ బృందాన్ని లక్ష్యంగా చేసుకున్నారు. ఇటీవలే విడుదలైన ఈ క్రేజీ మూవీ అజిత్ కి తమిళనాడులో రికార్డు కలెక్షన్లు తెచ్చిపెడుతోంది. నూటా యాభై కోట్లకు పైగానే వసూలైనట్టు ట్రేడ్ టాక్. ఇదిలా ఉండగా తన అనుమతి లేకుండా మూడు పాటలను రిఫరెన్స్ గా వాడుకోవడాన్ని ఆక్షేపిస్తూ అయిదు కోట్ల నష్టపరిహారంతో పాటు ఏడు రోజుల్లో క్షమాపణ కోరుతూ నోటీస్ పంపినట్టుగా వచ్చిన వార్త చెన్నై వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది. అంతగా ఆయన ఎందుకు రియాక్ట్ అయ్యారో చూద్దాం.
గుడ్ బ్యాడ్ అగ్లీలో మూడు సందర్భాల్లో ఇళయరాజా రిఫరెన్స్ వస్తుంది. అర్జున్ దాస్ ఇంట్రోలో ‘ఒత రువాయి తేనె’ని ఒరిజినల్ గా కంపోజ్ చేసింది రాజానే. నట్టుపుర పట్టు (1986) సినిమాలో ఉంటుంది. అప్పట్లో జానపద కళాకారులను ఊపేసిన గీతం ఇది. రెండోది ‘ఎన్ జోడి మంజా కురువి’ని కమల్ హాసన్ విక్రమ్ (1986) నుంచి తీసుకున్నారు. ఇది సూపర్ హిట్ సాంగ్. మూడోది అజిత్ జైలు సీన్లో వచ్చే ‘ఇలామై ఇదో ఇదో’ని సకలకళా వల్లవన్ (1979) నుంచి వాడుకున్నారు. లోకనాయకుడు ఛార్ట్ బస్టర్స్ లో దీనికి ప్రత్యేక స్థానం ఉంది. ఆధిక్ రవిచంద్రన్ చాలా జాగ్రత్తగా జనాలకు కనెక్ట్ అయిన క్లాసిక్ సాంగ్స్ నే తీసుకున్నాడు.
ఇదంతా బాగానే ఉంది కానీ మరి ఇళయరాజాకు ముందే ఎందుకు చెప్పలేదన్నది ఆసక్తికరం. కోలీవుడ్ రిపోర్ట్ ప్రకారం నిర్మాత సంస్థ మైత్రి మూవీస్ ఈ పాటల హక్కుదారులైన ఆడియో కంపెనీలకు తగిన రాయల్టి చెల్లించి తీసుకున్నారట. గతంలో మంజుమ్మల్ బాయ్స్ వివాదంలో కూడా ఇళయరాజా ఇంతే తీవ్రంగా స్పందించిన సంగతి గుర్తే. చాలా సంవత్సరాల క్రితం ఎస్పి బాలసుబ్రమణ్యంతో రాజాకు విభేదాలు వచ్చింది ఇలాంటి కాపీ రైట్స్ ఇష్యూ వల్లే. చాలా కాలం ఇద్దరు ఎడమొహం పెడమొహంలా విడిపోయారు. మరి ఇప్పుడీ గుడ్ బ్యాడ్ అగ్లీ కాంట్రవర్సీ ఎలాంటి క్లైమాక్స్ కు చేరుతుందోనని మ్యూజిక్ లవర్స్ ఎదురు చూస్తున్నారు.