సిద్ధు మెడకు ‘టిల్లు’ కత్తి

సిద్ధు జొన్నలగడ్డ కెరీర్‌న గొప్ప మలుపు తిప్పి అతడికి యువతలో మాంచి ఫాలోయింగ్ తెచ్చిపెట్టిన సినిమా ‘డీజే టిల్లు’. దీనికి కొనసాగింపుగా వచ్చిన ‘టిల్లు స్క్వేర్’ ఇంకా పెద్ద బ్లాక్ బస్టర్ అయింది. దీంతో సిద్ధు సినిమాల లెక్కలే మారిపోయాయి. తన పారితోషకం అమాంతం పెరిగింది. తన సినిమాల బడ్జెట్, బిజినెస్‌ కూడా కొన్ని రెట్లయ్యాయి. ఐతే ‘టిల్లు’ వల్ల సిద్ధు కెీరర్లో ఇలా చాలా పాజిటివ్స్ చోటు చేసుకున్నాయి కానీ.. దాని వల్ల ప్రతికూలతలూ లేకపోలేదని ఇప్పుడిప్పుడే అర్థం అవుతూ ఉంది.

టిల్లు పాత్ర తాలూకు హ్యాంగోవర్లోనే ‘జాక్’ సినిమా చేసిన సిద్ధు.. ఇందులోని ఏజెంట్ పాత్రలో కుదురుకోలేకపోయాడు. తనకు కొత్తగా అనిపించాల్సిన ఈ పాత్రలోనూ ‘టిల్లు’ మార్కు నటనే కనిపించి పాత్ర చెడిపోయింది. అదే సమయంలో ‘డీజే టిల్లు’ తర్వాత సిద్ధు నుంచి పీక్ ఎంటర్టైన్మెంట్ ఆశించి భంగపడ్డారు ప్రేక్షకులు.

మరోవైపు ‘డీజే టిల్లు’, ‘టిల్లు స్క్వేర్’ సినిమాల వసూళ్లు చూసి సిద్ధు తర్వాతి చిత్రాల బడ్జెట్, బిజినెస్‌లు పెంచేయడం కూడా చేటు చేసేలా ఉంది. ‘జాక్’ మూవీకి ఓవర్ బడ్జెట్ అయి నిర్మాత దెబ్బ తిన్నాడు. అలాగే ఈ సినిమా మీద ఎక్కువ పెట్టుబడి పెట్టిన బయ్యర్లకూ గట్టి దెబ్బే తగిలింది. ఇటు నిర్మాతేమో డెఫిషిట్లో సినిమాను రిలీజ్ చేశారు. మరోవైపు బయ్యర్లు పెట్టిన పెట్టుబడీ వెనక్కి రాలేదు. ఆల్రెడీ నష్టం మూటగట్టుకున్న ప్రొడ్యూసర్ ఇప్పుడు బయ్యర్లకు సెటిల్ చేయాల్సిన పరిస్థితికి చేరుకున్నారట. హీరో సైతం పారితోషకంలో సగం వెనక్కి ఇవ్వక తప్పేలా లేదట.

మొత్తంగా సిద్ధుకు ప్లస్ అనుకున్న ‘టిల్లు’నే ఇప్పుడు తనకు మైనస్ అవుతోంది. టిల్లు హ్యాంగోవర్ వల్ల కొత్త పాత్రలను పండించడం తనకు కష్టమవుతోంది. అదే సమయంలో తర్వాతి చిత్రాలతో ప్రేక్షకుల అంచనాలను అందుకోవడమూ సవాలుగా మారుతోంది. ఇక బడ్జెట్, బిజినెస్ సమస్యలూ తప్పట్లేదు. ఈ నేపథ్యంలో నీరజ కోన దర్శకత్వంలో చేస్తున్న ‘తెలుసు కదా’తో హిట్ కొట్టడం సిద్ధుకు అంత తేలిక కాదు.