నందమూరి కళ్యాణ్ రామ్ నుంచి రాబోతున్న కొత్త చిత్రం ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ మీద మంచి అంచనాలే ఉన్నాయి. ఈ చిత్రం మేకింగ్ దశలో ఉండగా పెద్దగా బజ్ లేదు కానీ.. టీజర్ వచ్చాక కావాల్సినంత హైప్ వచ్చింది. లేటెస్ట్‌గా రిలీజైన ట్రైలర్ సైతం అంచనాలను పెంచింది. ఈ చిత్రంలో క్లైమాక్స్ గురించి కళ్యాణ్ రామ్ ముందు నుంచి గొప్పగా చెబుతున్నాడు. ఇలాంటి క్లైమాక్స్ తెలుగులో ఇప్పటిదాకా రాలేదన్నాడు. ఇక ప్రి రిలీజ్ ఈవెంట్లో జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడుతూ.. చివరి 20 నిమిషాల సన్నివేశాలు చూసి కదిలిపోని, కన్నీళ్లు పెట్టని ప్రేక్షకుడు ఉండడని అన్నాడు.
అన్నదమ్ముల మాటలతో పతాక సన్నివేశాల మీద అంచనాలు పెరిగిపోయాయి. ముఖ్యంగా తారక్ మాటల మీద నందమూరి అభిమానులు చాలా నమ్మకంతో ఉన్నారు. ఐతే క్లైమాక్స్ చూసి కదిలిపోతారు, కన్నీళ్లు పెట్టుకుంటారు అంటుంటే.. ఇది ట్రాజిక్ క్లైమాక్స్ ఏమో అని సందేహాలు నెలకొన్నాయి. తెలుగు ప్రేక్షకులు విషాదాంతాలను ఇష్టపడరనే అభిప్రాయం ఉన్న సంగతి తెలిసిందే. దీనిపై దర్శకుడు ప్రదీప్ చిలుకూరి స్పందించాడు.
‘‘క్లైమాక్స్‌లో కన్నీళ్లు ఆగవు అంటే కథ విషాదాంతం అవుతుందని కాదు. ఎమోషన్స్ అలా ఉంటాయి. అమ్మకోసం మనం ఎన్ని త్యాగాలు చేయొచ్చో ఇందులో చూపించాం. కొంత వయసు వచ్చాక అమ్మ తనకు సంబంధించిన విషయాలను మరిచిపోతుంది. వాటిని మనం గుర్తు పెట్టుకోవడం ఎంత ముఖ్యమో చూపించాం. మన చిన్నపుడు మన పుట్టిన రోజును అమ్మ చేయడం సెలబ్రేషన్. మనం పెద్దయ్యాక అమ్మ పుట్టిన రోజును చేయడం ఎమోషన్. ఇదే సినిమాలో కీ పాయింట్. ఎన్టీఆర్, విజయశాంతి సినిమా చూశారు. కనెక్ట్ అయ్యారు. ఈ సినిమాలో వాళ్లకు నచ్చింది కూడా ఎమోషన్లే. ఇది కామెడీ యాక్షన్ సినిమా అని చెప్పను. ఎమోషనల్ మూవీ. పాటలు కూడా ఎక్కువ ఉండవు’’ అని ప్రదీప్ తెలిపాడు.