‘కింగ్‌డమ్’ సౌండ్ తగ్గిందేంటి?

విజయ్ దేవరకొండ కెరీర్లో అత్యంత కీలకమైన సినిమా.. కింగ్‌డమ్. విజయ్ గత చిత్రాలు లైగర్, ఫ్యామిలీ స్టార్ ఎంత పెద్ద డిజాస్టర్లు అయ్యాయో తెలిసిందే. అంతకుముందు కూడా విజయ్ కొన్ని ఫెయిల్యూర్లు చూశాడు కానీ.. ఈ చిత్రాలు అతడి ఫాలోయింగ్, మార్కెట్ మీద తీవ్ర ప్రభావం చూపాయి. తన మనుగడనే ప్రశ్నార్థకం చేశాయి. ఇలాంటి స్థితిలో అతను సితార ఎంటర్టైన్మెంట్స్ లాంటి సక్సెస్ ఫుల్ సంస్థలో ‘జెర్సీ’ దర్శకుడు గౌతమ్ తిన్ననూరితో చేస్తున్న ‘కింగ్‌డమ్’ మీద చాలా ఆశలే పెట్టుకున్నాడు. విజయ్ కెరీర్లోనే అత్యధిక బడ్జెట్లో, పెద్ద స్పాన్‌లో ఈ సినిమా తెరకెక్కుతోంది.

ఆ మధ్య రిలీజైన టీజర్ సినిమా మీద అంచనాలు పెంచింది. ఐతే ఆ టీజర్ వచ్చాక సినిమా గురించి ఏ అప్‌డేట్ లేదు. విడుదలకు ఇంకో నెలన్నరే సమయం ఉండగా.. టీం సైలెన్స్ మెయింటైన్ చేయడం అనుమానాలకు తావిస్తోంది. ‘కింగ్‌డమ్’ మేకర్స్ ప్రకటించినట్లు మే 30న రాదని కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కావాల్సిన ఈ సినిమా నుంచి ఈ సమయానికి పాటలు రిలీజ్ చేయడం మొదలుపెట్టాల్సింది. సినిమాను వార్తల్లో నిలబెట్టేలా ప్రమోషన్ల హడావుడి మొదలు కావాల్సింది.

కానీ టీం నుంచి అస్సలు సౌండ్ లేదు. ఇదిలా ఉండగా చిత్రీకరణ ఇంకా చాలా పెండింగ్ ఉందని.. కాబట్టి సినిమాను వాయిదా వేయబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో సినిమా గురించి ఏదో ఒక అప్‌డేట్ ఇవ్వాలని.. వాయిదా వేస్తున్నట్లయితే ఆ విషయాన్ని స్పష్టంగా చెప్పాలని విజయ్ అభిమానులు నిర్మాత నాగవంశీని డిమాండ్ చేస్తున్నారు. ఐతే ఆయన మాత్రం సినిమా వాయిదా పడదనే సన్నిహితులతో అంటున్నారట. ఆ విషయాన్ని ఏదో ఒక అప్‌డేట్ ద్వారా కన్ఫమ్ చేస్తే బాగుంటుందని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.