బంగారం లాంటి వేసవి వృథా అయిపోతోందని టాలీవుడ్ నిర్మాతలు వాపోతున్నారు. బలమైన పొటెన్షియాలిటీ ఉన్న మార్చి నెలలో కోర్ట్, మ్యాడ్ స్క్వేర్ లాంటి హిట్లు పడ్డప్పటికీ వందల కోట్ల బిజినెస్ చేసే స్టార్ హీరోల సినిమాలు రాకపోవడం థియేటర్ల ఆక్యుపెన్సీ మీద తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. ఏప్రిల్ లో బోణీ సరిగా జరగలేదు. జాక్, గుడ్ బ్యాడ్ అగ్లీ రెండూ అంతంత మాత్రంగానే నెట్టుకొస్తున్నాయి. అజిత్ వల్ల రెండోది కొంచెం పర్వాలేదనిపిస్తున్నా ఒరిజినల్ వెర్షన్ తో పోలిస్తే తెలుగులో చాలా వెనుకబడి ఉంది. యాంకర్ ప్రదీప్ అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయికి ఓపెనింగ్స్ రాలేదు. టాక్ యునానిమస్ గా లేకపోవడం కనిపిస్తోంది.
ఒకపక్క మాడిపోయే ఎండలు. జనాలు,పిల్లలు, యూత్ స్కూళ్లకు ఉద్యోగాలకు వెళ్లడమే పెద్ద భారంగా ఫీలవుతున్నారు. వ్యాపారస్తులు బేరాలు లేక చప్పబడిపోయారు. ఇంకోవైపు ఐపీఎల్ క్రికెట్ మ్యాచులు. ఎక్కడ చూసినా దీని గురించిన చర్చలే. సోషల్ మీడియాలో ఫలితాలు, ట్రోలింగులు, అంచనాలు, వీటి మీద డిస్కషన్లతో నెటిజెన్లు బిజీగా ఉన్నారు. దీంతో మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టు అంతో ఇంతో వచ్చే జనాలు కూడా థియేటర్లకు దూరంగా ఉండిపోయారు. ఫలితంగా చాలా కేంద్రాల్లో ఖాళీ సీట్లతో కనీసం అద్దెలు గిట్టుబాటు కాక బ్రేక్ ఇచ్చే బ్లాక్ బస్టర్ కోసం ఎగ్జిబిటర్లు వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు.
మార్చి, ఏప్రిల్ లో ప్లాన్ చేసుకున్న హరిహర వీరమల్లు, ఘాటీ, కన్నప్ప లాంటి ప్యాన్ ఇండియా మూవీస్ వాయిదా వేసుకోవడం పెద్ద ప్రభావమే చూపించింది. ఇప్పుడు భారమంతా ఓదెల 2, అర్జున్ సన్నాఫ్ వైజయంతి మీదే ఉంది. ప్రీ రిలీజ్ కు ముందు వీటి మీద పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి. చేస్తున్న ప్రమోషన్లు జనాన్ని రప్పించేలా ఉన్నాయి. కావాల్సిందల్లా పాజిటివ్ టాక్. అది కనక తెచ్చుకుంటే కనీసం రెండు వారాల పాటు వసూళ్లు రాబట్టుకోవచ్చు. సమ్మర్ ఎంటర్ టైన్మెంట్ కోసం తపించి పోతున్న ప్రేక్షకులకు మంచి ఛాయస్ కావొచ్చు. చూడాలి మరి ఇంత పెద్ద బాధ్యతని ఈ రెండు ఎలా నెరవేరుస్తాయో, ఏ ఫలితాలు అందుకుంటాయో.