విశ్వంభర టీజర్లో చూసింది సినిమాలో లేదా

గత ఏడాది విశ్వంభర టీజర్ కొచ్చిన నెగటివ్ రెస్పాన్స్ ఏ స్థాయిదో మళ్ళీ గుర్తు చేయనక్కర్లేదు. అందుకే నెలల తరబడి ఇంకే ప్రమోషనల్ కంటెంట్ వదలకుండా యువి సంస్థ విఎఫెక్స్ మీదే సీరియస్ వర్క్ చేయడం మొదలుపెట్టింది. సరే చెరిపేస్తే చెరిగేవి కాదుగా కొన్ని. అందుకే యూట్యూబ్ లో ఎప్పుడైనా ఈ టీజర్ కనిపిస్తే ఫ్యాన్స్ మరింతగా కలవరపడుతుంటారు. అయితే దర్శకుడు వశిష్ఠ తండ్రి, ఒకప్పటి ప్రముఖ నిర్మాత మల్లిడి సత్యనారాయణ రెడ్డి ఇటీవలే ఇచ్చిన ఒక వెబ్ ఇంటర్వ్యూలో చిన్నపాటి బాంబు పేల్చారు. టీజర్లో చూసినవి అసలు సినిమాలో ఉండవని, దాని వెనుక ఉన్న బ్యాక్ స్టోరీ వివరించారు.

విశ్వంభర విజువల్ ఎఫెక్ట్స్ పనులు ఒక కంపెనీకి ఇచ్చారు. మూడు నెలలు అనుకున్న సమయం కాస్తా ఆరు తొమ్మిది నెలలు ఇలా లేట్ అవుతూ వెళ్ళిపోయింది. ఈలోగా సంక్రాంతి రిలీజ్ అనుకోవడంతో అప్పటికప్పుడు హడావిడిగా ఏదో వర్క్ చేసి మమ అనిపించి టీజర్ వదిలారు. ఫ్యాన్స్ ని సంతృప్తి పరచడం కోసం ఏఐ టెక్నాలజీ వాడి విజువల్స్ పొందుపరిచారు. అనుకోకుండా తేడా కొట్టేసింది. ఊహించని డ్యామేజ్ జరిగిపోయింది. బేరం పోతుందని ముందు ఒప్పుకున్న సిజి సంస్థ మాట మీద నిలబడకపోవడంతో ఇంత సమస్య వచ్చింది. తర్వాత మేల్కొని క్వాలిటీ మీద దృష్టి పెట్టి సీరియస్ గా పని చేస్తున్నారని చెప్పుకొచ్చారు.

అంతా బాగానే ఉంది ఉంది మెగాస్టార్ ఫాంటసీ మూవీకి కృతకంగా ఏఐ వాడారంటేనే ఆశ్చర్యం కలుగుతోంది. ఎంతో సమయం వెచ్చించి, ఇతర సినిమాలను పక్కనపెట్టి మరీ విశ్వంభరకు ఓటేసిన చిరంజీవికి ఇలా జరగడం విచిత్రమే. సరే అయిందేదో అయ్యింది కానీ ఇకనైనా ప్రమోషన్ల విషయంలో శ్రద్ద తీసుకోవడం అత్యవసరంగా కనిపిస్తోంది. ఇంకా రిలీజ్ డేట్ ఖరారు కాలేదు. తాజాగా వచ్చిన రామ రామ పాట అంత గొప్పగా లేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. పెద్ది తరహాలో ఏదైనా బ్లాస్ట్ లేదా వైరలయ్యే కంటెంట్ ఇవ్వాలి. లేదంటే ఇలా నెగటివ్ ప్రాపగండా పెరిగిపోతుంది. దాన్ని సరిచేయాల్సిన బాధ్యత విశ్వంభర టీమ్ మీద ఉంది.