చప్పుడు లేదు.. థియేటర్లెప్పుడు?

అక్టోబరు 15 నుంచి థియేటర్లు తెరుచుకోబోతున్నాయంటూ ఇండియాలో ‘సినిమా’తో అనుబంధం ఉన్న ప్రతి ఒక్కరూ మురిసిపోయారు. కానీ ఆ తేదీ వచ్చింది. రెండు వారాలకు పైగా రోజులు గడిచిపోయాయి. కానీ పరిస్థితిలో ఏ మార్పూ లేదు. దేశవ్యాప్తంగా 90 శాతానికి పైగా థియేటర్లు ఇంకా మూత పడే ఉన్నాయి.
తెరుచుకున్న కొన్ని థియేటర్లు కూడా నామమాత్రంగా నడుస్తున్నాయి. థియేటర్లు తెరిచారు అన్న మాటే కానీ పెద్దగా సినిమాలు ఆడట్లేదు. జనాలూ థియేటర్లకు వెళ్లట్లేదు. 50 శాతం ఆక్యుపెన్సీ, ఇంకా ఏవేవో షరతులు అనగానే థియేటర్లను నడిపించడంలో అటు ఎగ్జిబిటర్లలోనూ ఆసక్తి లేకపోయింది. ఇంకోవైపు ప్రేక్షకులూ థియేటర్ల వైపు చూడలేదు. దీంతో థియేటర్ల పున:ప్రారంభానికి కేంద్ర ప్రభుత్వం అనుమతులిచ్చి ఏం ప్రయోజనం అన్న ప్రశ్న తలెత్తింది.

థియేటర్లు పూర్తి స్థాయిలో నడిస్తే సినిమాలు రిలీజ్ చేద్దామని నిర్మాతలు.. పేరున్న సినిమాలొస్తే ఆడిద్దామని ఎగ్జిబిటర్లు.. ఒకప్పట్లా థియేటర్లలో సినిమాలు నడిస్తే చూద్దామని ప్రేక్షకులు.. ఇలా అందరూ ఎదురు చూస్తున్న వాళ్లే. కానీ అందరూ కోరుకున్నట్లుగా సాధారణ పరిస్థితులు ఎప్పటికి నెలకొంటాయో ఎవరికీ తెలియడం లేదు. దసరా వెళ్లిపోయింది. త్వరలోనే దీపావళి రాబోతోంది. అప్పటికైనా థియేటర్లకు కళ వస్తుందేమో అనుకుంటే అలాంటి సంకేతాలేమీ కనిపించలేదు.

థియేటర్లు తెరుచుకున్నాయన్న మాటే కానీ.. కొత్త సినిమాలన్నీ ఓటీటీల వైపే అడుగులేస్తున్నాయి. నవంబర్లో వివిధ భాషల్లో పెద్ద ఎత్తున సినిమాలు రిలీజవుతున్నాయి. ఈ నెల మీద అయితే థియేటర్లకు ఎలాంటి ఆశల్లేవు. ఇంకొన్ని రోజుల తర్వాత ఈ ఇండస్ట్రీ పెద్దలు 100 శాతం ఆక్యుపెన్సీ కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తేవడానికి ప్రయత్నించే అవకాశముంది. ఆ ఒత్తిడికి తలొగ్గి క్రిస్మస్ సమయానికైనా థియేటర్లలో సినిమాలు పూర్తి స్థాయిలో నడవడం మొదలైతే.. సంక్రాంతి సమయానికైనా ఒకప్పటి సందడిని చూసే అవకాశముంటుంది. లేదంటే కొత్త ఏడాదిలో థియేటర్ల కష్టాలు కొనసాగడం ఖాయం.