ముందు విడుదల తేదీని ప్రకటించుకుని, ఆ తర్వాత పోటీదారులు వస్తే తప్పని పరిస్థితుల్లో డేట్ మార్చుకునే పరిస్థితి చిన్న సినిమాలకే వస్తుంది. సారంగపాణి జాతకంకి ఇది అనుభమవుతోంది. ఏప్రిల్ 18 నుంచి వాయిదా వేసుకుని వారం రోజుల తర్వాత 25కి వస్తున్నట్టు అధికారికంగా ప్రకటించుకుంది. కారణాలు స్పష్టం. ఏప్రిల్ 17 ఓదెల 2 వస్తోంది. ట్రేడ్ వర్గాల్లో మంచి క్రేజ్ సంపాదించుకుంది. హారర్ జానర్ కావడంతో మా ఊరి పొలిమేర 2, విరూపాక్ష తరహాలో హిట్టవుతుందనే నమ్మకం వాళ్లలో కనిపిస్తోంది. దానికి తగ్గట్టే హీరోయిన్ తమన్నా, నిర్మాత కం రచయిత సంపత్ నంది నాన్ స్టాప్ ప్రమోషన్లు చేస్తున్నారు.
మరుసటి రోజు ఏప్రిల్ 18 అర్జున్ సన్నాఫ్ వైజయంతి వస్తోంది. కళ్యాణ్ రామ్ సుమారు ఏడాదిన్నర తర్వాత చేసిన మూవీ ఇది. విజయశాంతి పవర్ ఫుల్ తల్లి పాత్రలో నటించడంతో అంచనాలు పెరిగాయి. దానికి తోడు జూనియర్ ఎన్టీఆర్ అతిథిగా ప్రీ రిలీజ్ ఈవెంట్ చేస్తుండటంతో తారక్ ఫ్యాన్స్ సపోర్ట్ పుష్కలంగా ఉండబోతోంది. యూనిట్ చెబుతున్న దాని ప్రకారం చూస్తే పైకి కమర్షియల్ చిత్రంగానే కనిపించినా ఊహించని ఎలిమెంట్స్ చాలా ఉంటాయని అంటున్నారు. సో ఓపెనింగ్స్ తో పాటు మంచి రన్ దక్కే అవకాశాలు మెండు. వీటి మధ్య సారంగపాణి జాతకం వస్తే థియేటర్లు, షోల పరంగా ఇబ్బందులు తప్పవు.
ఇవన్నీ దృష్టిలో ఉంచుకుని వాయిదా వేయడం తెలివైన నిర్ణయం. ఏప్రిల్ 25 రావాల్సిన కన్నప్ప తప్పుకుంది. భైరవం రావొచ్చన్నారు కానీ వాళ్ళూ సైలెంట్ అయ్యారు. కామెడీ ప్లస్ క్రైమ్ మిక్స్ చేసుకున్న సారంగపాణి జాతకంకి ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వం వహించారు. కోర్ట్ బ్లాక్ బస్టర్ తో మంచి ఊపుమీదున్న ప్రియదర్శికి దీని మీద చాలా నమ్మకం పెట్టుకున్నాడు. ఎందుకంటే బలగం, కోర్ట్ ఎంత సక్సెస్ అయినా పూర్తి క్రెడిట్ తనకు దక్కలేదు. కానీ సారంగపాణి అలా కాదు. సోలో హీరోగా తన మీదే ఎక్కువ బాధ్యత ఉంది. ఆదిత్య 369, నాని జెంటిల్ మెన్, సమంతా యశోద నిర్మించిన శివలెంక కృష్ణప్రసాద్ దీనికి నిర్మాత.