ఒకే సంస్థ….బొమ్మరిల్లు భాస్కర్ డబుల్ షాక్

భాస్కర్ అంటే వెంటనే గుర్తురాకపోవచ్చేమో కానీ ఆ పేరు ముందు బొమ్మరిల్లు అని తగిలిస్తే చాలు మూవీ లవర్స్ ఎవరైనా ఠక్కున ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళిపోతారు. మొదటి సినిమాతోనే దిల్ రాజు బ్యానర్ కి బ్లాక్ బస్టర్ ఇచ్చి ఆ వెంటనే రామ్ చరణ్ తో సినిమా చేసే అవకాశాన్ని దక్కించుకోవడం గురించి ఇప్పుడంత మీడియా అప్పట్లో లేదు కానీ ఉన్నంతలో విపరీతమైన కవరేజ్ తెచ్చుకున్న డైరెక్టర్ భాస్కర్. ముఖ్యంగా మ్యూజిక్ విషయంలో ఇతని అభిరుచి చాలా ప్రత్యేకం. అందుకే ఆరెంజ్ ఎంత డిజాస్టర్ అయినా ఇప్పటికీ దాని పాటలకున్న కల్ట్ ఫాలోయింగ్ రీ రిలీజ్ లోనూ కలెక్షన్ల వర్షం కురిపించేలా చేసింది.

పైన చెప్పిందంతా గతం. ఇప్పుడు వర్తమానంలోకి వద్దాం. జాక్ ఫలితం తేలిపోయింది. ఉదయం షోతోనే పెదవి విరుపులు ప్రారంభమయ్యాయి. విషయం అర్థం చేసుకున్న సిద్ధూ జొన్నలగడ్డ ఎలాంటి హడావిడి చేయకుండా సైలెంటైపోయాడు. సక్సెసని చెప్పి బాణాలు కాల్చడం, ప్రెస్ మీట్లు పెట్టడం లాంటివి చేయలేదు. జాక్ నిర్మించిన ఎస్విసిసి ప్రొడ్యూసర్ భోగవల్లి ప్రసాద్ కు ఇదే బొమ్మరిల్లు భాస్కర్ 2013 లో రామ్ హీరోగా ఒంగోలు గిత్త చేశారు. కానీ బొమ్మ ఆడలేదు. రిలీజ్ ముందు మంచి అంచనాలు ఉండేవి. మార్కెట్ యార్డ్ మాస్ ని హ్యాండిల్ చేయబోయిన భాస్కర్ తీరా ఫ్లాప్ అందుకున్నాడు.

కట్ చేస్తే పన్నెండు సంవత్సరాల తర్వాత తిరిగి అదే ఎస్విసిసి బ్యానర్ లో భాస్కర్ ఇంకో అవకాశం జాక్ రూపంలో దక్కింది. ఈసారి సిద్దు జొన్నలగడ్డ లాంటి ట్రెండింగ్ హీరో దొరికాడు. కానీ రిజల్ట్ మారలేదు. రిపీటయ్యింది. అప్పుడు ఫామ్ లో ఉన్న రామ్ కు ఫ్లాప్ ఇచ్చినట్టే ఇప్పుడు హాట్ కేక్ లా ఉన్న సిద్దుకి గాయం మిగిల్చాడు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ కి డీసెంట్ టాక్ వచ్చి గట్టెక్కడం వల్ల ఈయనకు మళ్ళీ ఆఫర్లు వచ్చాయి కానీ ఇప్పుడీ జాక్ తో మళ్ళీ తలుపు తెరుచుకోవడం డౌటే. అన్నట్టు జాక్ కి సీక్వెల్స్ కూడా రాసి పెట్టుకున్నానని చెప్పిన ఈ కల్ట్ డైరెక్టర్ ఇక వేరే హీరోని చూసుకోవాల్సిందే.