తెగిన ప్రతి టికెట్టు సిద్దూ పేరు మీదే

నిన్న విడుదలైన సిద్దు జొన్నలగడ్డ ‘జాక్’కు ఆశించిన స్థాయిలో స్పందన లేదు. రివ్యూలు పెదవి విరిచేయగా పబ్లిక్ టాక్ సైతం ఏమంత ఆశాజనకంగా లేకపోవడం నిరాశ కలిగిస్తోంది. వాస్తవానికి ప్రీ రిలీజ్ బజ్ అంతగా లేదు. పాటలు క్లిక్ కాలేదు. దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ ఏమంత ఫామ్ లో లేరు. హీరోయిన్ వైష్ణవి చైతన్యకు ఇంకా ఫాలోయింగ్ ఏర్పడలేదు. బ్యానర్ వైపు నుంచి ఈవెంట్లు, ఇంటర్వ్యూలు, ప్రెస్ మీట్లు లాంటి రెగ్యులర్ ప్రమోషన్లు జరిగాయి కానీ ప్రత్యేకంగా పబ్లిసిటీ పరంగా ఆడియన్స్ దృష్టిని ఆకర్షించలేకపోయారు. దీని వల్ల అడ్వాన్స్ బుకింగ్స్ ట్రెండింగ్ లోకి రావడానికి టైం పట్టింది.

ఇన్ని ప్రతికూలతలు మధ్య కూడా జాక్ డీసెంట్ ఓపెనింగ్స్ తెచ్చుకుంది. చాలా చోట్ల మంచి ఆక్యుపెన్సీలు నమోదయ్యాయి. పబ్లిక్ గుడ్ బ్యాడ్ అగ్లీ, జాట్ కన్నా దీనికే ప్రాధాన్యం ఇవ్వడం టికెట్ కౌంటర్ల వద్ద కనిపించింది. కరెంట్ బుకింగ్స్ పర్వాలేదని ట్రేడ్ వర్గాల రిపోర్ట్. ఇంత తక్కువ బజ్ లోనూ ఈ మాత్రం లాగిందంటే దానికి క్రెడిట్ సిద్ధూ జొన్నలగడ్డకే దక్కాలి. ఎందుకంటే డీజే టిల్లు, టిల్లు స్క్వేర్ తర్వాత యూత్ లో తనకంటూ ఫ్యాన్స్ వచ్చేశారు. కంటెంట్ ఎలా ఉన్నా మినిమమ్ ఫన్, ఎంటర్ టైన్మెంట్ తో నవ్విస్తాడనే అభిప్రాయం యువతలో ఉంది. నిన్న జాక్ థియేటర్లలో ఎక్కువ కనిపించింది వాళ్లే.

ఏ కోణంలో చూసుకున్నా జాక్ కు తెగిన ప్రతి టికెట్ సిద్దు పేరు మీదే. రా ఏజెంట్ల కాన్సెప్ట్ కి కామెడీ జోడించాలని చూసిన భాస్కర్ దాన్ని సీరియస్ గా చెప్పలేక, నవ్విస్తూ మెప్పించలేక తడబడటంతో నెగటివ్ ఫీడ్ బ్యాక్ తప్పలేదు. టిల్లు తర్వాత చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్న సిద్దు ఇలాంటి కథను ఎంచుకోవడం ఆశ్చర్యం కలిగించే విషయమే. యాక్షన్ బ్యాక్ డ్రాప్ తనకు సూటవుతుందని ఎలా అనుకున్నాడో కానీ బహుశా క్యారెక్టరైజేషన్ లో ఉన్న కామెడీ టచ్ వల్ల నచ్చి ఉండొచ్చు. ఏదైతేనేం తన బ్రాండ్ లో మార్కెట్ లో ఎంత ఉందో అర్థమయ్యింది కాబట్టి ఇకపై పొరపాట్లకు తావివ్వకుండా చూసుకోవాలి.