ర‌వితేజ పెద్ద హిట్ మిస్స‌య్యాడా?

మాస్ రాజా ర‌వితేజ స‌రైన హిట్టు కొట్టి చాలా కాలం అయిపోయింది. క‌రోనా కాలంలో వ‌చ్చిన క్రాక్ మూవీనే ర‌వితేజ‌కు చివ‌రి బ్లాక్ బ‌స్ట‌ర్. త‌ర్వాత వ‌చ్చిన సినిమాల‌న్నీ నిరాశ‌ప‌రిచాయి. క్రాక్ తీసిన గోపీచంద్ మ‌లినేనే గ‌త ఏడాది మాస్ రాజాతో మ‌రో సినిమా చేయ‌డానికి సన్నాహాలు చేసుకున్నాడు. మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మాణంలో ఈ సినిమా తెర‌కెక్కాల్సింది. కానీ అనౌన్స్‌మెంట్ త‌ర్వాత ఈ చిత్రం అనూహ్యంగా ఆగిపోయింది. ఓవ‌ర్ బ‌డ్జెట్ తేల‌డంతోనే ఈ సినిమాకు బ్రేక్ ప‌డింద‌ని వార్త‌లొచ్చాయి. ఐతే ఈ క‌థేమీ వేస్ట్ అయిపోలేదు. ఆ స్క్రిప్టుతోనే మైత్రీ ప్రొడ‌క్ష‌న్లోనే హిందీలో స‌న్నీ డియోల్ హీరోగా జాట్ మూవీ తీశాడు గోపీచంద్.

సౌత్ మ‌సాలా క‌థ‌కే కొంచెం బాలీవుడ్ ట‌చ్ కూడా ఇచ్చాడు. ఈ రోజే జాట్ ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. గ‌ద‌ర్-2 త‌ర్వాత స‌న్నీ నుంచి వ‌చ్చిన సినిమా కావ‌డంతో నార్త్ ఇండియాలో ఈ మూవీకి హైప్ బాగానే వ‌చ్చింది. ట్రైల‌ర్ స‌హా ప్రోమోల‌న్నీ కూడా ఆక‌ర్ష‌ణీయంగానే క‌నిపించాయి.
గురువారం మంచి అంచ‌నాల మ‌ధ్య రిలీజైన జాట్‌కు పాజిటివ్ టాక్ వ‌చ్చింది. గ‌త కొన్నేళ్లలో సౌత్ మ‌సాలా సినిమాల‌కు బాగా అల‌వాటు ప‌డ్డ హిందీ ఆడియ‌న్స్.. స‌న్నీ డియోల్‌ను సౌత్ ట‌చ్ ఉన్న క‌థ‌లో బాగానే చూడ‌డాన్ని బాగానే ఆస్వాదిస్తున్న‌ట్లుంది. ఇందులోని మాస్ మసాలా స‌న్నివేశాల‌కు థియేట‌ర్ల‌లో అదిరిపోయే రెస్పాన్స్ వ‌స్తోంది.

అర్బ‌న్, రూర‌ల్.. ఇలా అన్ని ఏరియాల్లో జాట్‌కు టాక్, థియేట‌ర్ రెస్పాన్స్ బాగుంది. రివ్యూలు కూడా పాజిటివ్‌గానే ఉన్నాయి. సినిమాకు బంప‌ర్ ఓపెనింగ్స్ వ‌చ్చేలా క‌నిపిస్తున్నాయి. ఇక ఈ సినిమా చూసిన తెలుగు ఫ్యాన్స్ చాలామంది వ్య‌క్తం చేస్తున్న అభిప్రాయం ఏంటంటే.. ర‌వితేజ ఒక పెద్ద హిట్ కొట్టే ఛాన్స్ మిస్స‌య్యాడ‌ని. మాస్ రాజాకు అయితే ఈ సినిమా ఇంకా ప‌ర్ఫెక్ట్‌గా ఉండేద‌ని.. తెలుగు ప్రేక్ష‌కులు ఈ సినిమాను బాగా ఆద‌రించేవార‌ని.. క్రాక్‌ను మించి పెద్ద హిట్ట‌య్యేద‌ని అంటున్నారు. బ‌డ్జెట్ స‌హా ఏ స‌మ‌స్య ఉన్నా వ‌ర్క‌వుట్ చేసి ఈ సినిమాను తెలుగులోనే తీసి ఉంటే బాగుండేద‌ని నెటిజ‌న్లు కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు రవితేజ ఇలాంటి మాస్ మసాలాలు ఇప్పటికే చాలా చేశాడని, మనవాళ్ళకి కూడా అంతగా నచ్చేది కాదు, రవితేజ చేయకపోవడమే మంచింది అయ్యిందని అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.