సూపర్ స్టార్ రజనీకాంత్ కెరీర్ లో అతి పెద్ద బ్లాక్ బస్టర్స్ గా చెప్పుకునే సినిమాల్లో బాషా స్థానం చాలా ప్రత్యేకం. తెలుగులో ఆయన మార్కెట్ ని అమాంతం పెంచింది కూడా ఈ మాస్ క్లాసిక్కే. 1995లో వచ్చిన బాషా సాధించిన సంచలన విజయం వెనుక కొన్ని తెలియని రాజకీయ విశేషాలున్నాయి. ముప్పై సంవత్సరాల తర్వాత తలైవర్ స్వయంగా వాటి గురించి నోరు విప్పారు. అవేంటో చూద్దాం. బాషా వంద రోజుల వేడుక చెన్నైలో జరిగింది. ఈ సందర్భంగా రజనీకాంత్ తన ప్రసంగంలో భాగంగా రాష్ట్రంలో బాంబుల సంస్కృతి బాగా పెరిగిపోయిందని అన్నారు. ఆ సమయంలో అధికారంలో ఉన్నది జయలలిత పార్టీ.
బాషా నిర్మాత ఆర్ ఎం వీరప్పన్ అప్పటి ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు. రజని అంత పెద్ద మాట అనడం జయలలితకు కోపం తెప్పించింది. స్టేజి మీద ఉండి దాన్ని ఖండించకపోవడానికి నిరసనగా వీరప్పన్ మినిస్టర్ పదవిని పీకేశారు. దీంతో బాధపడిన రజనీకాంత్ వెంటనే ఆయనకు ఫోన్ చేసి సిఎంతో మాట్లాడి సమస్య పరిష్కరిస్తానని అన్నారు. దానికి వీరప్పన్ బదులిస్తూ నా కోసం మీ గౌరవం పోగొట్టుకోవద్దని, పదవుల మీద నాకు మోజు లేదని అక్కడితో ముగించేశారు. ఈ కారణంగానే రజినీకాంత్ కు జయలలిత రాజకీయ విధానాల పట్ల వ్యతిరేకత వచ్చింది. ఇదంతా వీరప్పన్ డాక్యుమెంటరీలో చెప్పుకొచ్చారు.
చూసారుగా రాజకీయాలు, సినిమాలు ఎంత దగ్గరగా ముడిపడి ఉంటాయో. ఒక హీరో యథాలాపంగా అన్న మాట ఒక మంత్రి రాజకీయ జీవితాన్ని మార్చేసింది. ఏకంగా ముఖ్యమంత్రితో కయ్యం తెచ్చుకునేలా సూపర్ స్టార్ ని ప్రేరేపించింది. ఇదంతా జరిగిన తర్వాత వీరప్పన్ పాలిటిక్స్ కి స్వస్తి చెప్పి వ్యాపారాలు, సినిమాల్లో బిజీ కావడం వేరే పరిణామం. అప్పటి నుంచి రజనీకాంత్ తో ఆయన బంధం మరింత బలపడింది. ఆర్ ఎం వీరప్పన్ 97 వయసులో గత ఏడాదే అనారోగ్యం కారణంగా కన్నుమూశారు. దానికి నివాళిగానే ఆర్విఎం ది కింగ్ మేకర్ పేరుతో డాక్యుమెంటరీ రూపొందించారు. అందులోనే రజని ఈ విశేషాలు పంచుకున్నారు.