పోతూ పోతూ అవినాష్‍ని ముంచేసాడు

బిగ్‍బాస్‍ సీజన్‍ 4 నుంచి ర్యాప్‍ సింగర్‍ కమ్‍ యాక్టర్‍ నోయల్‍ షాన్‍ ఆరోగ్య కారణాలతో ఎలిమినేట్‍ అయ్యాడు. గంగవ్వ తర్వాత ఈ సీజన్లో పబ్లిక్‍ ఓటింగ్‍తో పని లేకుండా ఎలిమినేట్‍ అయ్యాడు నోయల్‍. అతడిని వైద్య పరీక్షలకు పంపించినపుడు తిరిగి తీసుకొద్దామనే అనుకున్నారు కానీ డాక్టర్లు ఎనిమిది వారాల రెస్ట్ చెప్పడంతో నోయల్‍ ఇక వైదొలగక తప్పలేదు. నోయల్‍ ఇలా అనుకోకుండా ఎగ్జిట్‍ అవడంతో ఈవారం ఎలిమినేషన్‍ని కాన్సిల్‍ చేసారు.

ఈసారి అమ్మ రాజశేఖర్‍ గ్యారెంటీగా అవుట్‍ అనుకుంటే మరోసారి అతను లక్కీగా ఎస్కేప్‍ అయిపోయాడు. ఇదిలావుంటే నోయల్‍ వెళుతూ వెళుతూ కమెడియన్‍ అవినాష్‍ గేమ్‍ని బదనాం చేసి పోయాడు. అతడు అవతలి వాళ్ల ఇబ్బందులపై సెన్స్లెస్‍ జోకులు వేస్తుంటాడని ఆరోపించి అవినాష్‍ ఆవేశంతో ఊగిపోయేట్టు చేసాడు. ఇన్ని రోజులు అవినాష్‍కి అనుకూలంగా సోషల్‍ మీడియాలో ట్రెండ్స్ జరిగేవి. కానీ నోయల్‍ చేసిన పనితో అవినాష్‍ సడన్‍గా బ్యాడ్‍ అయిపోయాడు. ఈ ఎఫెక్ట్ అతడికి పడే ఓట్లను ఖచ్చితంగా ప్రభావితం చేస్తుంది.

అభిజీత్‍కి స్నేహితుడయిన నోయల్‍ అవినాష్‍ స్ట్రాంగ్‍ కంటెండర్‍ కనుక ఇలా చేసి అభిజీత్‍ విజయావకాశాలను పెంచే స్ట్రాటజీ ప్లే చేసాడని కూడా అనుమానిస్తున్నారు. కానీ ఇంతకాలం సౌమ్యంగా వున్న నోయల్‍ ఎలిమినేషన్‍ స్టేజీపై మాత్రం బాంబులా పేలాడు.