ఆర్ఆర్ఆర్‌పై అనూహ్య వివాదాలు…రాజ‌మౌళికి సంచ‌ల‌న వార్నింగ్‌

సున్నిత‌మైన అంశాల విష‌యంలో ఊహించ‌ని స‌మ‌స్య‌లు ఎదుర‌వ‌డం స‌హ‌జ‌మే. అయితే, ఇటీవ‌లి కాలంలో సినిమాల విష‌యంలో అలాంటి ఇబ్బందులు ఎదుర‌వుతున్నాయి. తాజాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తూ, దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నన ప్రతిష్టాత్మక ఆర్ఆర్ఆర్ సినిమా ఊహించ‌ని వివాదంలో నిలిచింది. ఈ సినిమాలో తారక్ గిరిజన ఉద్యమకారుడు ‘కొమురం భీమ్’ పాత్రలో నటిస్తున్నారు. అయితే, దీనిపై బీజేపీ రాష్ట్ర క‌మిటీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది.

తెలంగాణా బీజేపీ అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఆర్ఆర్ఆర్ సినిమా సృష్టించిన వివాదంపై వార్నింగ్ ఇచ్చారు. కొమరం భీమ్ జయంతి సందర్భంగా మొన్న ఎన్టీఆర్ లుక్‌ని రివీల్ చేస్తూ టీజర్‌ని చిత్ర బృందం రిలీజ్ చేసింది. ఈ టీజర్‌లో ఎన్టీఆర్‌ ముస్లిం గెటప్‌ వివాదానికి దారితీసింది. దుబ్బాక ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న బండి సంజ‌య్ ఈ సంద‌ర్భంగా ఆర్ఆర్ఆర్ సినిమాపై ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. కొమరం భీంకు టోపి పెట్టడం ఏంటీ రాజమౌళి ? అని ప్రశ్నించారు.

దుమ్ముంటే నీజాం రజాకార్ల కు బొట్టు పెట్టి సినిమా తియ్యి అని ఆయన అన్నారు. డైరెక్టర్ రాజమౌళిని హెచ్చరిస్తున్న కొమురం భీం కి టోపీ ఉంటే సినిమా ఎట్లా రిలీజ్ అవుతుందో చూస్తామని ఆయన అన్నారు. కొమురం భీమ్‌ ను కించపరిచేలా సినిమా తీసిన రాజమౌళికి గుణపాఠం తప్పదని అన్నారు. మా బిడ్డను కించపరిచేలా ముస్లిం టోపీ పెట్టినావు దమ్ముంటే ఓల్డ్ సిటీ లో వున్న ముస్లింకి కాషాయం కండువా వేసి సినిమా తీయమని అన్నారు.

బిడ్డ రాజమౌళి సినిమా రిలీజ్ చేస్తే.. బరిగలతో కొట్టి చంపుతామని ఆయన వార్నింగ్ ఇచ్చారు. కొమురం భీంకి టోపీ ఉంటే సినిమా ఎట్లా రిలీజ్ అవుతుందో చూస్తాం! అని అయన వార్నింగ్ ఇచ్చారు. కొమురం భీమ్‌కు టోపి పెట్టడంపై ఆదివాసీ గిరిజనులు ఆగ్రహ వ్యక్తం చేస్తున్నారు. కొమురం భీం మనవడు కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాడు అందుకే అలాంటి సన్నివేశాలు తొలగించాలి. లేక‌పోతే సినిమా విడుదల కానివ్వ‌బోం. తెలంగాణ యావత్ సమాజం కదులుతుంది, సినిమా థియేటర్లు తగలబడుతాయి అంటూ హెచ్చ‌రించారు. డైరెక్టర్ రాజమౌళి తండ్రి, సోదరుడు అంటే చాలా గౌరవం మాకుంది. మా అభిప్రాయాల‌ను గౌర‌వించండి అని కోరారు.