దేనికైనా టైమింగ్, ప్లానింగ్ ఉంటే ఫలితాలు కరెక్ట్ గా వస్తాయి. నిన్నపెద్ది టీజర్ విషయంలో దర్శక నిర్మాతలు తీసుకున్న ఈ జాగ్రత్త అదిరిపోయే రిజల్ట్ ఇచ్చింది. ఇరవై నాలుగు గంటలు గడవక ముందే దేవరని గ్రాస్ చేస్తూ ఒక్క రోజులో 30 మిలియన్ల వ్యూస్ సాధించిన టాలీవుడ్ మూవీగా మొదటి రికార్డు అందుకోవడం అభిమానులను ఆనందంలో ముంచెత్తుతోంది. ముందు నుంచి చెబుతున్నట్టు ఈ గ్లిమ్ప్స్ దెబ్బకు బిజినెస్ లెక్కలు మారిపోయాయి. విడుదలకు ఏడాది సమయం ఉన్నప్పటికీ ముందు అనుకున్న దానికన్నా ఎక్కువ అడ్వాన్స్ ఇచ్చేందుకు డిస్ట్రిబ్యూటర్లు ఉత్సాహం చూపిస్తున్నట్టు ఇన్ సైడ్ టాక్.
ఇక్కడ టైమింగ్ గురించి కొంచెం ప్రస్తావించుకోవాలి. ఒకపక్క ఐపిఎల్ సీజన్ నడుస్తోంది. క్రికెట్ ప్రేమికులు దీని హ్యాండ్ ఓవర్ లో ఉన్నారు. ఇలాంటి సమయంతో రామ్ చరణ్ తో సిక్సర్ కొట్టించే షాట్ పెట్టడం ఒక్కసారిగా సోషల్ మీడియాని ఒప్పేసింది. గంటల వ్వవధిలో వేలాది ట్రెండింగ్ వీడియోస్ వచ్చేశాయి. చరణ్ బ్యాటింగ్ ని సింహాద్రి, జల్సా, సలార్, దసరా లాంటి సినిమాలతో ముడిపెడుతూ ఆన్ లైన్ ఎడిటర్లు తమ క్రియేటివిటీని బయట పెడుతున్నారు. వాట్సాప్ తదితర గ్రూపుల్లో షేర్ వేసుకుంటున్నవి లక్షల్లో ఉంటున్నాయి. ఇదంతా కేవలం ఒక్క షాట్ చూపించిన ప్రభావమే.
నిర్మాత రవిశంకర్ అన్నట్టు తమకు తెలియకుండానే ఒకొక్కరు కొన్ని వందలసార్లు ఈ బ్యాటింగ్ షాట్ చూసేలా వైరలైపోయింది. రీల్స్ కూడా చేస్తున్నారు. ఐపీఎల్ మ్యాచులు ఇంకా బోలెడున్నాయి. అన్ని టీములు ముఖ్యంగా హైదరాబాద్ టీమ్ కోసం ఫ్యాన్స్ పెద్ది క్లిప్ ని ఎన్ని సార్లు వాడుకుంటారో చెప్పలేం. ఆర్ఆర్ఆర్ తో వచ్చిన ప్యాన్ ఇండియా గుర్తింపు రామ్ చరణ్ కు హిందీలో ఉపయోగపడుతోంది. దీని కోసం స్వంతంగా డబ్బింగ్ చెప్పుకోవడం గమనించాల్సిన విషయం. శంకర్ మీద సైతం చూపించినంత నమ్మకం రామ్ చరణ్ కు బుచ్చిబాబు మీద వచ్చేసింది. దానికి తగట్టే ఫ్యాన్స్ నమ్మకాన్ని మొదటి అడుగులో గెలిచేసుకున్నాడు.