బాలీవుడ్ ఆల్ టైం టాప్ స్టార్లలో సల్మాన్ ఖాన్ ఒకడు. ఒకప్పుడు ఆయన సినిమాలకు యావరేజ్ టాక్ వస్తే చాలు.. వందల కోట్ల వసూళ్లు వచ్చేసేవి. కానీ ఎప్పుడూ రోజులు ఒకేలా ఉండవు. ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే బిగ్గెస్ట్ స్టార్‌గా ఎదిగిన ఆమిర్ ఖాన్ సైతం ‘లాల్ సింగ్ చడ్డా’తో ఎంత దారుణమైన పరిస్థితి ఎదుర్కొన్నాడో తెలిసిందే. సల్మాన్ పరిస్థితి కూడా ఇప్పుడు ఇంతే దయనీయంగా తయారైంది. గత కొన్నేళ్లుగా ఎదురవుతున్న వరుస పరాజయాల నుంచి ‘సికందర్’ మూవీతో బయటపడతాడనుకుంటే.. ఇంకా కిందికి పడిపోయాడు కండల వీరుడు.
సౌత్ సీనియర్ డైరెక్టర్ మురుగదాస్ రూపొందించిన చిత్రం.. సల్మాన్ కెరీర్లోనే అత్యంత పేలవమైన చిత్రాల్లో ఒకటిగా పేరు తెచ్చుకుంది. తొలి రెండు మూడు రోజుల్లో ఓపెనింగ్స్ వరకు పర్వాలేదనిపించిన ఈ చిత్రం ఆ తర్వాత బాక్సాఫీస్ దగ్గర చతికిలపడింది. ఆరో రోజైన శుక్రవారం ఈ చిత్రానికి దేశవ్యాప్తంగా కేవలం రూ.3 కోట్ల నెట్ వసూళ్లు వచ్చాయి. ఇండియాలో ఈ సినిమా ఓవరాల్ ఆక్యుపెన్సీ కేవలం 6 శాతం కావడం గమనార్హం. సల్మాన్ సినిమాకు ఆరో రోజు ఇంత దారుణమైన ఆక్యుపెన్సీ రావడం అంటే పెద్ద షాక్ అనే చెప్పాలి. ఒకప్పుడు సల్మాన్ మూవీకి రెండు మూడు రోజుల్లోనే వంద కోట్ల వసూళ్లు వచ్చేసేవి. కానీ వారం అవుతున్నా ఈ చిత్రం ఆ మార్కును అందుకోవడానికి కష్టపడుతోంది.
రెండో వీకెండ్లో ఈ సినిమాను ప్రేక్షకులు పట్టించుకునే పరిస్థితి కనిపించడం లేదు. ఆదివారంతో థియేట్రికల్ రన్ ముగిసిపోయినట్లే. ఈ చిత్రానికి సల్మాన్ రూ.120 కోట్ల పారితోషకం తీసుకున్నాడట. థియేటర్ల నుంచి కనీసం తన రెమ్యూనరేషన్ కూడా వెనక్కి రాని పరిస్థితి. నాన్ థియేట్రికల్ రైట్స్‌తోనే నిర్మాత సాజిద్ నడియాడ్‌వాలా కొంత సేఫ్ అవుతున్నాడు. కానీ సినిమాను కొన్ని బయ్యర్లు మాత్రం మునిగినట్లే.