అల్లు అర్జున్ 22 : రంగం సిద్ధం

పుష్ప 2 ది రూల్ తో ఆల్ ఇండియా బ్లాక్ బస్టర్ సాధించిన అల్లు అర్జున్ తర్వాతి సినిమాకు రంగం సిద్ధమయ్యింది. అట్లీ దర్శకత్వంలో చేయబోయే యాక్షన్ ఎంటర్ టైనర్ తాలూకు అనౌన్స్ మెంట్ ఎల్లుండి ఏప్రిల్ 8 ఐకాన్ స్టార్ పుట్టినరోజు సందర్భంగా రానుంది. ఒక వీడియో రూపంలో బన్నీ, అట్లీతో పాటు నిర్మాత కళానిధి మారన్ పాల్గొన్న డిస్కషన్ షాట్స్ తో పాటు అమెరికాలో పలు స్టూడియో నిపుణులతో విఎఫెఎక్స్ గురించి హీరో దర్శకుడు కలిసి చేసిన చర్చలు అందులో పొందుపరచబోతున్నారట. ఊహించని సంభాషణలు, విజువల్స్ ఇందులో భాగం కాబోతున్నాయని మాకందిన ఎక్స్ క్లూజివ్ అప్డేట్.

ఏ జానర్ అనే లీక్స్ స్పష్టంగా బయటికి రాలేదు కానీ అంతర్గత సమాచారం మేరకు అల్లు అర్జున్ మొదటిసారి ద్విపాత్రాభినయం చేయబోతున్నాడు. రెండు షేడ్స్ డిఫరెంట్ గా ఉంటాయట. జవాన్ లో షారుఖ్ ఖాన్ ని చూసి ఎలాగైతే షాకయ్యామో ఇందులో కూడా అంతకు మించిన ట్రీట్ మెంట్ తో అట్లీ ట్విస్ట్ ఇస్తాడని అంటున్నారు. క్యాస్టింగ్ లో ప్రియాంకా చోప్రా ఉందనే టాక్ రెండు మూడు రోజుల నుంచి తెగ చక్కర్లు కొడుతోంది. దానికి సంబంధించిన స్పష్టత వీడియోలో ఇస్తారో లేదో చూడాలి. బన్నీకున్న ప్యాన్ ఇండియా ఇమేజ్ దృష్టిలో పెట్టుకుని అన్ని బాషల ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా ప్రోమో రెడీ చేశారు.

విడుదల తేదీ చెప్పే సూచనలున్నాయని అల్లు కాంపౌండ్ టాక్. అదేంటి ఇంకా షూటింగ్ మొదలుకాలేదు కదా అంటే పక్కా ప్రణాళికతో ఏ టైంలోగా పూర్తి చేయాలనే దాని గురించి బన్నీ, అట్లీ ఇద్దరూ దుబాయ్ లో సుదీర్ఘంగా చర్చించి ఒక అండర్ స్టాండింగ్ కి వచ్చారట. ఈ ప్రాజెక్టులో గీతా ఆర్ట్స్ నిర్మాణ భాగస్వామి అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు టాక్. 2026 విడుదలని లక్ష్యంగా పెట్టుకున్న అల్లు అర్జున్ 22 ఎప్పుడు వచ్చినా పుష్ప రికార్డులకు ఎసరు పెట్టడం ఖాయం. అన్నట్టు అనౌన్స్ మెంట్ ప్రోమోలో సరదా కబుర్లు, బన్నీ మార్కు పంచులు కొన్ని ఉన్నాయట. ఇంకో నలభై ఎనిమిది గంటల్లో సస్పెన్స్ వీడనుంది.