ట్రోలింగ్‌పై స్పందించిన మోహన్ బాబు

టాలీవుడ్లో విపరీతంగా సోషల్ మీడియా ట్రోలింగ్ ఎదుర్కొనే ఫ్యామిలీ ఏదంటే.. మంచు వారి వైపే చూపిస్తారు ఎవరైనా. తమ మీద జరిగే ట్రోలింగ్ గురించి మంచు విష్ణు, మంచు లక్ష్మీప్రసన్న, మంచు మనోజ్ గతంలో ఓపెన్‌గానే మాట్లాడారు కూడా. దాన్ని వాళ్లు స్పోర్టివ్‌గానే తీసుకుంటూ ఉంటారు. ఐతే వీరి తండ్రి మోహన్ బాబు మాత్రం ఆ తరహా కాదు. ముందు తరానికి చెందిన వ్యక్తి కాబట్టి ఆయనకు ఇలాంటివి రుచించవనే అనిపిస్తుంది. సోషల్ మీడియా ట్రోలింగ్ గురించి ఆయన స్పందించిన సందర్భాలు కూడా పెద్దగా కనిపించవు.

తాజాగా ఆయన సోషల్ మీడియా ట్రోల్స్ గురించి తన అభిప్రాయం చెప్పారు. తమ కుటుంబానికి ఎంతో ప్రతిష్టాత్మకమైన ‘కన్నప్ప’ సినిమా విడుదలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో ఆయన ట్రోలింగ్ మీద స్పందించారు. ‘‘నేను ట్రోలింగ్‌ను పట్టించుకోను. పక్కవారు నాశనం కావాలని ఎప్పుడూ కోరుకోకూడదు. అలా కోరకుంటే వాళ్ల కంటే ముందు మనం నాశనం అవుతాం. ఒకరిని మార్చాలని మనం ఎప్పుడూ భావించకూడదు. అందరూ క్షేమంగా ఉండాలని కోరుకుంటాను. ట్రోలింగ్ చేయడం వల్ల వాళ్లకు ఏం ఆనందం వస్తుందో నాకు ఇప్పటికీ అర్థం కాదు. నేను ఈ విషయంలో ఎవరినీ నిందించను’’ అని మోహన్ బాబు అన్నారు.

దేవుడి దయ వల్లే ‘కన్నప్ప’లో నటించే అవకాశం వచ్చిందన్న మోహన్ బాబు.. తన కెరీర్లో 560 సినిమాల్లో నటించానని.. వాటిలో కొన్ని సినిమాలు ఫెయిలై ఉండొచ్చని.. నటుడిగా మాత్రం తాను ఎప్పడూ ఫెయిలవలేదని స్పష్టం చేశారు. తన ఆవేశం, కోపం గురించి ఆయన స్పందిస్తూ.. తాను ఎప్పుడూ ఇతరులకు అపకారం చేయలేదని.. తననే ఎంతోమంది మోసం చేశారని.. అందుకే తనలో ఆవేశం పెరిగిందని.. కానీ దాని వల్ల మళ్లీ తానే నష్టపోయానని వ్యాఖ్యానించారు. తనకు ఇకముందూ మంచి పాత్రలు వస్తే నటిస్తూ.. పిల్లలతో సరదాగా ఉండాలనుకుంటున్నానని ఆయన చెప్పారు. తన ఆస్తులు అన్నీ తాకట్టు పెట్టి ఎన్టీఆర్ చివరి సినిమా ‘మేజర్ చంద్రకాంత్’ను నిర్మించానని.. ఆయనే వారించినా వినలేదని.. మొండిగా ఆ సినిమా తీసి సక్సెస్ అయ్యానని మోహన్ బాబు చెప్పారు.