ప్రియదర్శి మధ్యలో ఇరుక్కున్నాడే

కోర్ట్ రూపంలో ఇటీవలే బ్లాక్ బస్టర్ చవి చూసిన ప్రియదర్శి నెల తిరగడం ఆలస్యం ఏప్రిల్ 18న సారంగపాణి జాతకంతో ప్రేక్షకులను పలకరించబోతున్నాడు. మొత్తం తెలుగు నటీనటులతో రూపొందిన ఈ ఎంటర్ టైనర్ కు ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వం వహించారు. మొదటి నుంచి చివరి దాకా నవ్విస్తూ ఉంటామని టీమ్ హామీ ఇస్తోంది. కోర్ట్ విషయంలో ప్రియదర్శికి సోలో క్రెడిట్ దక్కలేదు. కొత్త జంటతో పాటు దర్శకుడు, శివాజీ అందరూ సమానంగా పంచుకున్నారు. కానీ సారంగపాణి అలా కాదు. తనకిది సోలో మూవీ. హిట్టు కొడితే మార్కెట్ పరంగా చాలా ఉపయోగపడుతుంది. అయితే ఇక్కడో చిక్కు ఉంది.

అనుష్క ఘాటీ వాయిదా పడగానే ఆ డేట్ తీసుకున్న సారంగపాణి జాతకంకు ఇప్పుడు కీలకమైన పోటీ ప్రత్యర్థులు తయారయ్యారు. ఒకరోజు ముందే వచ్చే తమన్నా ఓదెల 2 మీద మాస్ వర్గాల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి. బిజినెస్ కూడా బాగా జరిగింది. కంటెంట్ కనక వర్కౌట్ అయితే మంచి లాభాలు వస్తాయి. ఎలాంటి స్టార్ క్యాస్టింగ్, పెద్ద బడ్జెట్ లేకుండానే మా ఊరి పొలిమేర 2 అంత విజయం సాధించినప్పుడు బోలెడు ఆకర్షణలున్న ఓదెల 2కి ఇంకా ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. పైగా ముందే వచ్చే అడ్వాంటేజ్ ఖచ్చితంగా ఓపెనింగ్స్ తీసుకొస్తుంది. హారర్ జానర్ కాబట్టి ముందే ఫలితాన్ని ఊహించలేం.

ఇది పక్కనపెడితే కళ్యాణ్ రామ్ అర్జున్ సన్నాఫ్ వైజయంతి డేట్ ని ఏప్రిల్ 18 ప్రకటించడం ఫ్యాన్స్ ని ఆశ్చర్యపరిచింది. నిజానికి అందరూ మేలో వస్తుందనుకున్నారు. కానీ హఠాత్తుగా నిర్ణయం మార్చుకోవడం వేసవి సెలవులను లక్ష్యంగా పెట్టుకోవడమే. పక్కా కమర్షియల్ ఎలిమెంట్స్ తో రూపొందిన ఈ సినిమాలో విజయశాంతి పాత్ర, భారీ బడ్జెట్, ప్రమోషన్స్ అంచనాలను పెంచుతున్నాయి. పటాస్, అతనొక్కడేని మించి ఇది ఉంటుందని కళ్యాణ్ రామ్ హామీ ఇస్తున్నాడు. సో ప్రియదర్శి ముందు ఓదెల 2 ఆ తర్వాత అర్జున్ సన్నాఫ్ వైజయంతితో తలపడాల్సి ఉంటుంది. మరి ఎలా నెగ్గుకొస్తాడో చూడాలి.