గత కొన్నేళ్లలో ఇండియన్ బాక్సాఫీస్‌లో అతి పెద్ద సంచలనం అంటే.. కాంతార మూవీనే అని చెప్పాలి. కేవలం రూ.16 కోట్ల బడ్జెట్లో తెరకెక్కిన చిత్రమిది. కన్నడలో చిన్న స్థాయిలో రిలీజైన ఈ సినిమా అక్కడ అద్భుత స్పందన తెచ్చుకుని.. తర్వాత తెలుగు, హిందీ, తమిళ భాషల్లోకి కూడా అనువాదమైంది. ప్రతి చోటా సంచలన వసూళ్లతో దూసుకెళ్లింది. ఏకంగా రూ.400 కోట్ల క్లబ్బులో అడుగు పెట్టింది. ఈ సినిమాతో హీరో కమ్ డైరెక్టర్ రిషబ్ శెట్టి రేంజే మారిపోయింది. పాన్ ఇండియా స్థాయిలో మోస్ట్ వాంటెడ్ హీరో కమ్ డైరెక్టర్ అయిపోయాడు. తెలుగు, హిందీ భాషల్లో భారీ చిత్రాలు ఒప్పుకున్న అతను.. ప్రస్తుతం కాంతార ప్రీక్వెల్ చిత్రీకరణలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.
ఈ సినిమా ఈ ఏడాది దసరాకు రిలీజ్ కావాల్సి ఉంది. ఐతే చత్రీకరణ ఆలస్యం అవుతుండడంతో కాంతార చాప్టర్ 1ను వచ్చే ఏడాదికి వాయిదా వేస్తున్నట్లు కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోంది. ఈ ప్రచారంపై చిత్ర బృందం స్పందించింది. కాంతార చాప్టర్ 1 షూటింగ్ సజావుగానే సాగుతోందని.. ముందు ప్రకటించిన ప్రకారమే ఈ ఏడాది అక్టోబరు 2న ఈ చిత్రాన్ని విడుదల చేస్తామని నిర్మాణ సంస్థ హోంబలే ఫిలిమ్స్ స్పష్టం చేసింది. ఈ సినిమా మీద పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలున్న నేపథ్యంలో ఈసారి చాలా పెద్ద బడ్జెట్లో, భారీస్థాయిలో సినిమాను తీర్చిదిద్దుతోంది రిషబ్ బృందం.
కాంతార కథ ఎక్కడి నుంచి మొదలైందో అక్కడ్నుంచి వెనక్కి వెళ్లి.. కాంతార బ్యాక్ స్టోరీని చూపించబోతున్నారు. కాంతారలో హైలైట్ అయిన డివైన్ ఎలిమెంట్స్‌ను కాంతార చాప్టర్ 1 లో మరింత ఎలివేట్ చేసి చూపించనున్నారు. ఇందులో తారాగణం కూడా భారీగానే ఉంటుందట. ఐతే ఇందులో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కూడా ఓ కీలక పాత్ర పోషిస్తున్నట్లు వార్తలు రాగా.. వాటిని ఆయన ఖండించారు. ఐదారు భారతీయ భాషల్లో కాంతార ప్రీక్వెల్ ఒకేసారి విడుదల కానుంది. ఈ చిత్రానికి రూ.500 కోట్ల మేర బిజినెస్ అవుతుందని అంచనా వేస్తున్నారు.