హరీష్‍ శంకరే టైమ్‍ అడిగాడంట

పవన్‍ కళ్యాణ్‍ అవీ ఇవీ మొదలు పెడుతున్నాడు కానీ గబ్బర్‍సింగ్‍ దర్శకుడు హరీష్‍ శంకర్‍తో సినిమా అనౌన్స్ చేసి కూడా అది మొదలు పెట్టడేంటని ఫాన్స్ అసహనానికి గురవుతున్నారు. హరీష్‍ శంకర్‍ కూడా పవన్‍ పుట్టినరోజుకి కాన్సెప్ట్ పోస్టర్‍ విడుదల చేసి ఫాన్స్ని మరీ ఊరించాడు. ఆ పోస్టర్‍ చూసిన తర్వాత పవన్‍ కళ్యాణ్‍ కూడా హరీష్‍ని పిలిపించి కథ సిద్ధమయిందా అని అడిగాడట.

అయితే హరీష్‍ దగ్గర ఇంకా పూర్తి కథ రెడీ కాలేదట. గబ్బర్‍సింగ్‍ తర్వాత తమ కాంబినేషన్లో సినిమా కనుక అంచనాలు తారాస్థాయిలో వుంటాయనేది హరీష్‍ శంకర్‍కి తెలుసు. అందులోను రామయ్యా వస్తావయ్యా, డిజె తర్వాత స్టార్‍ హీరోలు అతని దర్శకత్వంలో నటించడానికి అంతగా ఆసక్తి చూపిస్తున్నట్టు లేదు. అందుకే దర్శకుడిగా ఈ చిత్రం అతనికి పెద్ద సవాల్‍.

మరోసారి ఇండస్ట్రీ తనవైపు తిరిగి చూసేలా గబ్బర్‍సింగ్‍ని తలదన్నే సినిమా తీయాలనేది హరీష్‍ శంకర్‍ లక్ష్యం. అందుకే పవన్‍కళ్యాణ్‍ని తొందరపెట్టి ఏదో ఒక సినిమా చేసేయాలని చూడకుండా వీలయినంత సమయం తీసుకుని పకడ్బందీ కథతో రావాలని నిర్ణయించుకున్నాడు.